దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సినీతారలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇలాగే ముంబయిలో ఉత్సవాలలో పాల్గొంది. లెహంగాతో అందంగా ముస్తాబై ఈ వేడుకకు వచ్చింది. హుషారుగా అక్కడ కాసేపు గడిపింది. ఆ తర్వాత ఇంటికెళ్లి.. ఓ పోస్టు పెట్టింది. ‘ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే….’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది!
వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఊర్వశీకి చేదు అనుభవం ఎదురైంది. ఊర్వశీని చూడగానే.. అక్కడి ప్రజలు రిషభ్ పంత్.. రిషభ్ పంత్ అని అరవడం మొదలు పెట్టారు. అక్కడ ఇబ్బందిగా అనిపించినా కిమ్మనకుండా ఊర్వశి ఇంటికి బయలుదేరింది. ఆ తర్వాత పై విధంగా పోస్టు పెట్టింది. కానీ, వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందేమోనన్న వార్తలు మరోసారి తెరమీదికొచ్చాయి. అసలు పంత్‌కు, ఊర్వశీకి మధ్య ఏం జరుగుతోంది?
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఊర్వశీ రౌతేలా, రిషభ్ పంత్ ల గురించే! వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు కూడా పుట్టించారు. ఈ రూమర్లను నిజం చేసేలా ఊర్వశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన కోసం ‘ఆర్పీ’ చాలా సేపు ఎదురుచూశాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు సర్దిచెప్పి.. ముంబయిలో కలుద్దామని చెప్పినట్లు ఈ భామ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ‘ఆర్పీ’ అంటే.. రిషభ్ పంత్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ నోటా.. ఈ నోటా.. ఈ వ్యవహారం రిషభ్ పంత్ వరకు వెళ్లింది.
దీనిపై రిషభ్ పంత్ వ్యవహార శైలి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. ‘కొందరు పబ్లిసిటీ కోసం అబద్ధాలాడటం హాస్యాస్పదం. ఫేమస్ కావడం కోసం ఎలాపడితే అలా మాట్లాడటం బాధాకరం. నన్ను వదిలేయ్ అక్కా’ అంటూ ఇన్ స్టా వేదికగా పంత్ పోస్ట్ పెట్టాడు. ఆశ్చర్యమేమిటంటే.. పెట్టిన 10నిమిషాలకే పంత్ తన పోస్టును డిలీట్ చేశాడు. ఆలోపు అది వైరల్ అయింది. దీనిపై ఊర్వశీ ఘాటుగానే స్పందించింది. ‘తమ్ముడు పంత్.. నువ్వు బ్యాట్ బాల్ ఆడుకోమ్మా. బద్నాం కావడానికి నేను చిన్నదాన్ని కాదు’ అంటూ సమాధానమిచ్చింది.
ఆసియా కప్‌తో మళ్లీ వార్తల్లోకి..
పంత్, ఊర్వశీల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆసియా కప్.. దీనికి మరింత ఆజ్యం పోసింది. అసలు తాను క్రికెట్ చూడనని చెప్పిన రౌతేలా.. ఇండియా మ్యాచ్‌లకు హాజరై ఆశ్చర్యపరిచింది. పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ అనంతరం ఊర్వశీ ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాక్ బౌలర్ వీడియోను ఇందులో జత చేయడం విమర్శలకు దారితీసింది. తన అందానికి పాక్ బౌలర్ పడిపోయేలా కనిపిస్తున్న ఓ ఎడిట్ వీడియోను పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆమెను ట్రోల్ చేశారు. వీటన్నింటి నడుమ ఆమె వినాయకచవితి వేడుకల్లో పాల్గొనడం.. పంత్ అని స్థానికులు అరవడంతో ఈ అమ్మడికి చిర్రెత్తుకొచ్చింది. ఇక తనను వదిలేయండి అంటూ ప్రాధేయపడింది. అయితే ఊర్వశీ చేసిన పోస్టులో గాంభీర్యం చూపిస్తున్నప్పటికీ.. పంత్ విషయంలో తనను వదిలేయమని కోరుతున్నట్లు కనిపిస్తోంది.
పంత్, ఊర్వశీ అఫైర్ నిజమేనా..?
ఆసియా కప్ కి హాజరైన ఊర్వశీ.. పంత్ కోసమే వచ్చిందంటూ చాలా మంది గుసగుసలాడుకున్నారు. కానీ ఇది నిజం కాదని కొందరు అంటున్నారు. పంత్ వేరొక అమ్మాయితో డేటింగులో ఉన్నాడని చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇషా నేగీతో పంత్ ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేదంటున్నారు. దీంతో పంత్, ఊర్వశీల మధ్య ఎలాంటి బంధం లేదని కొట్టిపడేస్తున్నారు!
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!