ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 24) పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పవన్ ఏఐ పోస్టు..?
తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్ జీపీటీ లేదా ఏఐ సాయంతో పదాల కూర్పును జనరేట్ చేయించి పవన్ ఈ ట్వీట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
‘ఏఐ’ వినియోగంలో తప్పుందా!
కార్తీపై పవన్ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రమిటికల్ తప్పులు లేకుండా ఏఐ సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్ ఏఐ టూల్ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్ ఏఐ ట్వీట్ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
కార్తీ చేసిన తప్పేంటి?
సోమవారం జరిగిన ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్ లడ్డు ప్రస్తావన తీసుకురాగా ‘ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది’ అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’ అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ లడ్డు టాపిక్ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్!
కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్టైన్మెంట్ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్ రియాక్షన్ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.