అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘పుష్ప’పై పవన్ కల్యాణ్ నెగిటివ్ కామెంట్స్ చేయడం, ఆ తర్వాత ‘నాకు ఇష్టమైతే వస్తా’ అంటూ బన్నీ వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే ఈ వివాదానికి ‘పుష్ప 2’తో చెక్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్, బన్నీ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘పుష్ప 2’ ఈవెంట్‌కు పవన్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ ఆఖరి వారంలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని పుష్ప టీమ్ భావిస్తోంది. ఏపీలో భారీ ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించి దానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో అల్లు అర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో భేటి అవుతారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బన్నీ రిక్వెస్ట్‌ను పవన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పవన్, బన్నీ ఒకే వేదికపై కనిపించనున్నారు. తద్వారా గత కొంతకాలంగా జరుగుతున్న అల్లు vs మెగా ఫ్యాన్ వార్‌కు చెక్ పడే ఛాన్స్ ఉంది. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య ఏమైనా వివాదాలు ఉన్నా కూడా ఈ దెబ్బతో తొలగిపోతాయని చెప్పవచ్చు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించడం వెనుక ఓ వ్యూహం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ డిజాస్టర్ చేస్తామంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపు సైతం ఇస్తున్నారు. తొలి నుంచి బన్నీకి అండగా నిలిచిన మెగా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తుండటంతో ‘పుష్ప 2’ టీమ్ ఆలోచనల్లో పడినట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ‘పుష్ప 2’ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతోంది. దీంతో ఎలాగైన ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశ్యంతో పవన్‌ను గెస్ట్‌గా పిలవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. దానివల్ల బన్నీపై ఉన్న నెగిటివ్ తగ్గి ఎప్పటిలాగే ‘పుష్ప 2’ను మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.
హైప్ పెంచిన అనసూయ
‘పుష్ప 2’ చిత్రంలో ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ (Anasuya) కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఇటీవల బిగ్‌బాస్ షోకు అతిథిగా వచ్చిన అనసూయకు ‘పుష్ప 2’కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. హోస్ట్ నాగార్జున ఈ మూవీకి సంబంధించి చెప్పాలని కోరారు. దీంతో అనసూయ స్పందిస్తూ ‘పుష్ప 2’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని చెప్పింది. గతంలో వచ్చిన ‘పుష్ప’ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమేనని ‘పుష్ప 2’ లోనే అసలు సినిమా అని వ్యాఖ్యానించింది. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంచనాలు పెంచేసింది.
‘పుష్ప 3’ పక్కా
‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ సైతం మూడో పార్ట్ గురించి హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్ 3 కి సంబంధించి సాలిడ్ లీడ్ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా ‘పుష్ప 3’ ఉంటుందని పునరుద్ఘటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు.
రూ.1000 కోట్ల బిజినెస్!
‘పుష్ప 2’ చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించినట్లు(Pushpa 3) తెలిపాయి. నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్ రూ.120 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.