అనూహ్యంగా ముంచుకొస్తున్న వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న భారీ వానలు, ఒక్క రోజులోనే అస్తవ్యస్తమవుతున్న జనజీవనం. గత నాలుగైదు ఏళ్లుగా ఇదే పరిస్థితి. వరుణుడి ప్రకోపానికి జన జీవనం కల్లోలమైపోతోంది. కానీ దీనంతటికీ కారణం ఒక దేశమో, ఒక ప్రాంతమో చేస్తున్న క్లౌడ్ బరస్ట్ అవునో కాదో తెలియదు గానీ, దశాబ్దాలుగా మానవులు చేస్తున్న తప్పిదాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏళ్లుగా ప్రకృతిపై మానవుడి చర్యలకు ప్రతిచర్యలే ఈ వానలని చెబుతున్నారు.
వానల వరం వరదల శాపంగా ఎలా మారింది?
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు మీదుగా 1,60,000 చ.కి.మీల మేర ఉన్న పశ్చిమ కనుమలు మన దేశానికి వరప్రదాయని లాంటివి. అద్భుతమైన వృక్ష, జంతు సంపదకు నిలయం.ప్రపంచంలోని 8 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ లో ఇవి ఒకటి. దేశంలో రుతుపవనాల గమనానికి, వానాకాలానికి ఇవే కారణం. దక్షిణ భారతంలో వానాకాలంలో మేఘాలకు ఇవి ఒక ఆనకట్టలా పనిచేస్తాయి.జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దక్షిణ భారతంలో వానలకు ఇవే మార్గనిర్దేశకులు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ కనుమలు మానవ ఆక్రమణకు గురవుతున్నాయి. మైనింగ్, అడవుల నరికివేతతో ఇప్పటికే కోలుకోలేని స్థితిలో దెబ్బతిన్నాయి. గత 17 ఏళ్లలో 20వేల హెక్టార్లకు పైగా పశ్చమ కనుమల భూభాగం ఆక్రమణ గురైందని అంచనా. దీని ప్రభావం భవిష్యత్ తరాలపై గట్టిగా ఉంటుందని ఎన్నో ఏళ్లుగా పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. 2018 కేరళ, కర్ణాటక వరదలు, 2020 హైదరాబాద్ వరదలు, ఈ యేడాది గోదావరి ఉగ్రరూపమే ఇందుకు ఉదాహరణ.
పరిరక్షణ చర్యలపై పట్టని ప్రభుత్వాలు
2011లోనే గాడ్గిల్ కమిటీ పశ్చిమ కనుమల పరిరక్షణపై నివేదిక ఇచ్చింది. కానీ ఇది వెలుగులోకి రాలేదు. దీనికి తోడు గాడ్గిల్ కమిటీ నివేదికను పునః పరిశీలించేందుకు 2012లో కేంద్రం కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయినా గాడ్గిల్ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వచ్చింది. దేశంలోని సుమారు 30 కోట్ల మందికి ప్రాణాధారమైన నీటిని అందించే ఈ కొండల పరిరక్షణపై ప్రభుత్వాల పట్టింపు అవసరమనేది పర్యావరణ శాస్త్రవేత్తలు నెత్తీ నోరు మొత్తుకుని చెప్పే మాట.
కాపాడకుంటే మహోగ్రరూపమే
పశ్చిమ కనుమల పర్యవసానానికి ప్రత్యక్ష బాధిత రాష్ట్రమైన మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో రాష్ట్రంలో గోదావరి ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. భద్రాచలంలో చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో 71 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తోంది. ఇది 75 అడుగులకు కూడా చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కడెం లాంటి ప్రాజెక్టు అధికారులు తేరుకునేలోపే నీటమునిగింది అంటే ప్రకృతి ప్రకోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా పశ్చిమ కనుమలను కాపాడుకుని, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులకు కారణమవుతున్న కారకాలపై ప్రభుత్వాలు, ప్రజలు దృష్టి సారించకుంటే మానవ మనుగడకే ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!