నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకొని నాని హిట్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్మురేపుతోంది. అత్యధిక వ్యూస్ సాధిస్తూ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది.
నేషనల్ వైడ్ ట్రెండింగ్
నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ ఈ సినిమాను ప్రసారానికి తీసుకువచ్చారు. ఇక అందరి అంచనాలను అందుకుంటూ ఈ మూవీ అత్యధిక వ్యూస్ సంపాదిస్తోంది. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే దేశవ్యాప్తంగా టాప్ వన్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెటిఫ్లిక్స్ వర్గాలు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. హీరో నాని ఈ పోస్టర్‌ను తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీని వెనక్కినెట్టిన నాని
జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఉలఝ్’ (Ulajh) కూడా సరిపోదా శనివారం వచ్చిన మరుసటిరోజు నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. దీంతో ఈ రెండు చిత్రాలు టాప్ ప్లేస్ కోసం పోటీపడుతున్నాయి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఉలఝ్’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకువచ్చి సెప్టెంబర్ 27న ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా సెకండ్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఉలఝ్ మూవీకి సుదాన్షు సారియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుహనా భాటియా పాత్రలో జాన్వీ కనిపించారు. రోషన్ మాథ్యూ కూడా లీడ్ రోల్ చేశారు.
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్
సరిపోదా శనివారం చిత్రాన్ని ఆగస్టు 29న దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో భారీ ఒపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్లో నాని ఇరగదీశాడు. రికార్డు వసూళ్లు సాధించారు. థియేటర్లో క్లోజింగ్ బిజినెస్ పూర్తయ్యే నాటికి రూ.100.39 గ్రాస్‌ను సరిపోదా శనివారం తన ఖాతాలో వేసుకుంది. నాని కెరీర్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. గతేడాది వచ్చిన దసరా రూ.121 కోట్ల వసూళ్లను రాబట్టింది.
నాని సినిమాలో ఇవే హైలెట్స్
‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. నాని, ఎస్.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్, జేక్స్ బేజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో – విలన్ మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్లుగా మారాయి.
‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే..
సూర్య (నాని) ఎల్ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్ దయా (ఎస్.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? హీరో-విలన్ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..