ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శోభితానా మజాకా..!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్సైట్లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), కాజోల్ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్ నటుడు లక్ష్య, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్ 14, దివ్య ఖోస్లా కుమార్ 18, ఫహాద్ ఫాజిల్ 25, విజయ్ 27, విక్రాంత్ మెస్సీ 35, త్రిష 37, జాన్ అబ్రహం 39, కమల్ హాసన్ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది.
పాపులారిటీకి కారణమిదే!
నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్మెంట్ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.
నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే!
టాలీవుడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్ చేశారు. వాస్తవానికి చై-శోభిత డేటింగ్లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల ‘మంకీ మాన్’ అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో ‘సితారా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్