కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు కోసం పోటీపడ్డాయి. నరాలు తెగే ఉత్కంఠతో ఈ మ్యాచ్ లు జరిగాయి. మరి వాటిని ఓసారి గుర్తుచేసుకుందామా.
తొలి నాకౌట్ మ్యాచ్..
అరంగేట్ర సీజన్లో ఆస్ట్రేలియాతో ఇండియా నాకౌట్ మ్యాచ్‌లో తలపడింది. సెమీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాకు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించింది. కానీ, టీమిండియా బౌలర్లు పుంజుకుని 173పరుగులకే కట్టడి చేశారు. దీంతో ఇండియా ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ 30బంతుల్లో 70 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇలా తొలి సమరంలో ఆస్ట్రేలియాకు షాకిచ్చి.. అనంతరం ట్రోఫీని ఇండియా ముద్దాడింది.
గ్రూప్ దశలో..
2010 వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు మరోసారి పోటీపడ్డాయి. ఈ సారి గ్రూప్ దశలోనే తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. కానీ, ప్రత్యర్థికి భారీ స్కోరును ముట్టజెప్పింది. డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా త్వరగానే చాప చుట్టేసింది. 135 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే భారత్ ఇంటిముఖం పట్టింది.
కొలొంబోలో మళ్లీ..
2012లో కొలొంబో వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఏమాత్రం పోరాడే స్కోరును సాధించలేకపోయింది. 20ఓవర్లకు 140 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్‌ని ఛేజ్ చేసింది.
ప్రతీకారం తీర్చుకున్న భారత్
గత రెండు మ్యాచుల్లోనూ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగింది. సొంతగడ్డపైనే(2014) టోర్నీ జరుగుతుండటం మన జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా.. గౌరవప్రదమైన స్కోరు చేసింది. 160పరుగుల లక్ష్యాన్ని కంగారూలకు నిర్దేశించింది. అయితే, ఈ సారి అశ్విన్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల పతనాన్ని శాసించాడు. మెరికల్లాంటి బంతులతో కీలకమైన ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. దీంతో 86 పరుగులకే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. 73పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రతీకారం తీర్చుకుంది.
2016లో చివరిసారిగా..
భారత్, ఆస్ట్రేలియా జట్లు చివరిసారిగా ఈ టోర్నీలో పోటీపడింది 2016లోనే. కానీ, ఇది రెండు జట్లకు చావోరేవో మ్యాచ్. సెమీఫైనల్ లోకి చేరుకోవాలంటే గెలవాల్సిందే. ఈ రసవత్తర సమరానికి మొహాలీ వైదికైంది. మొదట బౌలింగ్ చేసిన భారత్.. ఆస్ట్రేలియాను 160 పరుగులకు పరిమితం చేసింది. కానీ, ఛేజింగ్‌లో తడబడింది. తక్కువ పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. మరో ఎండ్ లో విరాట్ ఒక్కడే దృఢంగా నిల్చున్నాడు. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుతూ అద్భుతంగా పోరాడాడు. 82పరుగులు చేసి.. మరో ఐదు బంతులు మిగిలుండగానే ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు.
అన్నీ కలిసొస్తే మళ్లీ నాకౌట్ లో..
ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఇండియాదే పైచేయి. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. అన్నీ కలిసొస్తే.. ఈ రెండు జట్లూ సెమీఫైనల్/ ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మరో ఆసక్తికరమైన పోరుకు తెరపడినట్లే.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!