నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, తదితరులు.
దర్శకత్వం: కళ్యాణ్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
సినిమాటోగ్రఫీ: వి.మురుగేశన్
లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఈ సారి డిఫరెంట్ జానర్‌ని ఎంచుకుని ‘టక్కర్’ రూపంలో పూర్తి యాక్షన్ సినిమాని తీసుకొచ్చాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డ సిద్ధార్థ్ యాక్షన్ సన్నివేశాలకు అనుగుణంగా తన ఫిజిక్‌ని మార్చుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సిద్ధార్థ్‌కు ‘టక్కర్’ ఆ కోరిక నెరవేర్చిందా? కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందా? తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన టక్కర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందా? అనే విషయాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి?
ఓ పేదింటి కుర్రాడు ధనవంతుడు కావాలని కలలు కంటాడు. ఈ ప్రక్రియలో నగరానికి వచ్చి తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతాడు. కానీ, మధ్యలో మాఫియాతో ఇబ్బందుల్లో పడతాడు. మరోవైపు, ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. మరి, ఆ కుర్రాడు చివరికి సంపన్నుడు అయ్యాడా? ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? అనే అంశాలను తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారు?
సినిమా కోసం తన లుక్‌ని మార్చుకోవడానికి ప్రత్యేకంగా కష్టపడ్డాడు సిద్ధార్థ్. ఎప్పటిలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. నటనకు ఎంతో స్కోప్ ఉన్నప్పటికీ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. ఏదో సినిమాను పూర్తి చేసేయాలన్న ఆత్రంలోపడి నటించడం మర్చిపోయినట్లు అనిపిస్తుంది. సినిమాకు ప్లస్ పాయింట్‌లా ఉండాల్సిన హీరో మైనస్‌గా కనిపిస్తాడు. ఇక్కడే మొదట బోల్తా కొట్టింది. ఇక హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పరిధి మేరకు నటించింది. స్కిన్ షోలో రెచ్చిపోయింది. రొమాన్స్ బాగా పండించింది. బోల్డ్ సీన్లలో సిద్ధార్థ్- దివ్యాంశ పోటీ పడి నటించారు. ఇక విలన్‌గా చేసిన అభిమన్యు సింగ్ పాత్ర తొలుత ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా చివరికి జోకర్‌లా అనిపిస్తుంది. కమెడియన్ యోగిబాబు కాసేపు నవ్వించాడు.
టెక్నికల్‌గా
డైరెక్టర్ కళ్యాణ్ జి క్రిష్ మంచి కథాంశాన్నే ఎంచుకున్నాడు. దీనిని తెరపై చూపించడంలో విఫలం అయ్యాడు. సినిమాలో యాక్షన్ సీన్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. సినిమా పరిచయ సన్నివేశాలతో ఆసక్తి పెంచి నిరాశాజనకంగా ముగించడం రుచించలేదు. ఫస్టాఫ్‌లో ఓకే అనిపించినా సెకండాఫ్‌ని ఇంట్రెస్టింగ్‌గా ముగించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. విలన్ పాత్ర పేలవంగా ఉంది. ఇక, సంగీతం విషయానికొస్తే నివాస్ కె. ప్రసన్న సినిమాకు చేసిందేమీ లేదు. ప్రేక్షకుల దృష్టి సినిమా వైపు మళ్లేలా పాటలు లేవు. చిత్రంలోని నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. మురుగేశన్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సన్నివేశాలు
రొమాన్స్
మైనస్ పాయింట్స్
సిద్ధు నటన
పసలేని కథనం
మ్యూజిక్