తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం దసరా సందడి మొదలుకానుండగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ తలపడటం లేదు. దసరాకు గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ వంటి స్టార్ల సినిమాలు వస్తుండగా, ఈ వారం డబ్బింగ్ సినిమాల హవానే ఉంది. పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గురు, శుక్ర వారాల్లో తెలుగులో వస్తున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం.
నేనే వస్తున్నా
ధనుష్ డ్యూయల్ రోల్లో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నేనే వస్తున్నా. ధనుష్, ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు, శ్రీరాఘవ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ అడవిలో సాగే కథలా ట్రైలర్ ఆసక్తిగా కనిపించింది.శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న థియేటర్లలో విడుదలవుతోంది.
పొన్నియన్ సెల్వన్
ఈ వారం అతిపెద్ద రిలీజ్ పొన్నియన్ సెల్వన్ అని చెప్పవచ్చు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తీ వంటి భారీ తారాగణంతో తెరక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చిత్రబృందం భారీగానే ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తెలుగులో ఎలా ఆడుతుందో చూడాలి మరి.
నేను ℅ నువ్వు, రుద్రవీణ
ఈ వారం విడుదలవుతున్న రెండు చిన్న సినిమాల్లో నేను ℅ నువ్వు ఒకటి. ఒక చిన్న కిరాణ కొట్టు కుర్రాడు ఆ ఊరి జమిందారు చెల్లితో ప్రేమలో పడటం, కుల వ్యవస్థ తదితర అంశాల చుట్టూ ఈ కథను నిర్మించుకున్నారు. సెప్టెంబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు రుద్రవీణ అనే మరో సినిమా కూడా సెప్టెంబర్ 30ననే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
OTT విడుదలలు
కెప్టెన్
తమిళ నటుడు ఆర్య నటించిన ‘కెప్టెన్’ మూవీ ఈ నెల 30 నుంచి ‘జీ5’ లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించినంత మేర రాణించలేకపోయింది. ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
కోబ్రా
చియాన్ విక్రమ్, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం కోబ్రా. విక్రమ్ ఓ గణిత శాస్త్రవేత్తగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో సోనీ లివ్‌లో సెప్టెంబర్ 28న సినిమా విడుదల కాబోతోంది.
చార్లీ 777
రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో పెంపుడు కుక్క నేపథ్యంలో తెరకెక్కిన సినిమా చార్లీ 777. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లో చూడలేకపోయిన చాలామంది ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. కన్నడ వెర్షన్ ఇప్పటికే విడుదలైనప్పటికీ తెలుగులో మాత్రం అమేజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది.