ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది. బుధ, గురు వారాల్లోనూ ఉరుములతో కూడిన వర్షం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గత వారం రోజులుగా ఈ అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ వర్షాలుంటాయని తెలియడంతో ఆవేదన చెందుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడితే కొద్ది రోజుల్లో చేతికి అందొచ్చే పంట పూర్తిగా నాశనం అయిపోతుంది.
అటు తెలంగాణలోనూ ఇటీవల వడగండ్ల వర్షం కర్షకుల పాలిట శాపంగా మారింది. చాలాచోట్ల పంటలు నాశనం అయ్యాయి. జిల్లాలో పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్… నష్టపోయిన వారికి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.