అమెరికాలో భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేరు మార్మోగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున వివేక్ అధ్యక్ష బరి పోటీలో ఉన్నారు. మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతి మహిళ నిక్కీ హేలితో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్ తలపడుతున్నారు. దీంతో రోజు సరికొత్త ప్రకటనలతో, ప్రసంగాలతో వివేక్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
తాజాగా వివేక్ తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత విధానాన్ని ఎత్తేసి దాని స్థానంలో మెరిట్ ఆధారిత విధానాన్ని తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇది భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అంతకుముందు కూడా వివేక్ కీలక ప్రకటన చేశారు. తాను అధ్యక్షుడినైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు క్షమాభిక్ష పెడతానన్నారు. పాలసీల విషయంలో ట్రంప్‌ది తనది ఒకే రకమైన ఆలోచనా విధానమని వివేక్ రామస్వామి అన్నారు. అయితే తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకువెళ్లడమేనని వివేక్ స్పష్టం చేశారు.
అటు చైనా-రష్యా సంబంధాలపైనా వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ఆ దేశానికి రష్యాను దూరం చేయాలని వివేక్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. తాను అధ్యక్షుడ్ని అయితే దీనికి సంబంధించి పుతిన్‌తో ఒప్పందం చేసుకుంటాని వివేక్ అన్నారు. తద్వారా చైనాపై అమెరికా అధిపత్యం కొనసాగేలా చేస్తానని చెప్పుకొచ్చారు.
ఇక వివేక్ నేపథ్యానికి వస్తే.. ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు.
హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో వివేక్ విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్ అనే సంస్థ వివేక్ ఏర్పాటు చేశారు.
2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా వివేక్ రామస్వామి నిలిచారు.
కార్పొరేట్ ప్రపంచంలో జాత్యహంకారం, వాతావరణ మార్పులపై ‘సూడో ఉదారవాద’ భావనలతో విసుగు వస్తోందని వివేక్ చాలాకాలంగా గొంతెత్తి చెబుతున్నారు. ఈ ధోరణి వ్యాపారాన్ని, దేశాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా, ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా అర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని వివేక్ అభిప్రాయపడ్డారు. వివేక్ అభిప్రాయాలను కొందరు రిపబ్లికన్లు మెచ్చుకున్నారు.
ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్ రామస్వామి అనేక మంది మద్దతును చూరగొన్నారు. తర్వాత నిర్వహించిన పోల్‌లో 504 మంది స్పందన తెలియజేయగా అందులో 28శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!