ఆదిదేవుడు గణపతికి పూజ చేయకుండా కెమెరా ఆన్ కాదు. క్లాప్పింగ్ పడదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిత్రపరిశ్రమలో సందడే సందడి. కొత్త సినిమా ప్రకటనలతో, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ విడుదలతో పండుగ చేసుకుంటుంది. తారల సెలబ్రేషన్స్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణ. అయితే, ఏకదంతుడిపై రూపొందిన కొన్ని గేయాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంటాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..!
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..
వినాయక చవితికి ఏ మండపం వద్ద చూసినా, ఏ వీధిలోకెళ్లినా.. తప్పక వినిపించే పాట.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా దేవా..!’ 1991లో విడుదలైన ‘కూలీ నెం.1’ సినిమాలోనిదీ గేయం. నాలుగు దశాబ్దాలైనా ఈ పాట గురించి మాట్లాడుకునేంతలా మన చెవుళ్లలో ప్రతిధ్వనిస్తోంది. ఇదే ఈ పాట ప్రత్యేకత. మండపాల వద్ద ఈ పాట మోగనిదే పండుగ పరిపూర్ణం అవదు. ఉత్సాహభరితంగా సాగే ఈ పాటను సిరివెన్నెల రాయగా.. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.
జై.. జై.. గణేషా
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాలోని ‘జై.. జై.. గణేషా.. జై కొడతా గణేషా.. జయములివ్వు బొజ్జ గణేషా..’ పాట కూడా మరపురానిది. ఆలోచింపజేసే చంద్రబోస్ సాహిత్యం.. మణిశర్మ మ్యాజికల్ మ్యూజిక్.. మైమరిపించే మెగాస్టార్ స్టెప్పులు.. ఈ సాంగ్ ని ఇంకోస్థాయికి తీసుకెళ్లాయి. అప్పటి సామాజిక స్థితిగతులను వివరిస్తూ.. వాటి నుంచి గట్టెక్కించు దేవుడా అంటూ ఈ పాట సాగుతుంది.
తిరు తిరు గణనాథ..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ సినిమాలోనూ వినాయకుడిపై ఓ పాటకట్టారు. ‘తిరు తిరు గణనాథ..’ అంటూ ఈ పాట మొదలవుతుంది. తన చదువుకు బాసటగా నిలవమని హీరోయిన్ తమన్నా వినాయకుడిని కోరుతూ సాగే ఈ పాట ఆద్యంతం శ్రావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులను ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
గమ్.. గమ్..గమ్.. గణేషా
ఆధ్యాత్మిక చింతన కలిగిన హీరోల్లో బాలకృష్ణ ఒకరు. వినాయకుడిని స్తుతిస్తూ డిక్టేటర్ సినిమాలోని ‘గమ్..గమ్..గమ్.. గణేషా’ పాటకు ఆయన కాలుకదిపారు. కలర్ ఫుల్ గా సాగే ఈ పాటను కూడా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.
బన్నీ.. గణపతి బప్పా మోరియా
ఇద్దరమ్మాయిలతో సినిమాలోని ‘గణపతి బప్పా మోరియా’ పాట కూడా వినాయక ఊరేగింపులో తరచూ వినిపిస్తుంటుంది. విభిన్నంగా సాగే ఈ పాట కుర్రకారు మదిని దోచింది. మరింకెందుకు ఆలస్యం.. ఈ పాటల్ని మనమూ ఓసారి వినేద్దామా..!
ఇందులో మీకు బాగా నచ్చిన పాటేంటి మరి?