సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్‌జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్‌జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్‌జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.
స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్‌జాదా కల్పించలేక పోయింది.
స్టోరీ లైన్‌లో మార్పు..
ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్‌జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
‘అల వైకుంఠపురంలో’ రాజ్ మనోహర్(సుశాంత్)కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్‌జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు.
హీరో క్యారెక్టరైజేషన్..
అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్‌జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్‌లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.
ఫైట్స్ కొరియోగ్రఫీ
ఫైట్ సీన్‌లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్‌లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్‌జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.
పాత్రలు
‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్‌జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్‌లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.
సంగీతం
‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్‌ని మూటగట్టుకుంది.
అల్లు అర్జున్ మేనియా
షెహ్‌జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్‌జాదా’కు మైనస్‌గా మారింది.
రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా?
గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్‌జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్‌గన్ మూవీ హిట్ అయ్యింది.
దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్‌గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం