• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Architectural Buildings: భారత్‌లో10 అద్భుతమైన పురాతన కట్టడాలివే..బహుశా వీటిని మళ్ళీ కట్టలేరేమో.. !

    భారదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి నిర్మాణాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వస్తుంటారు. అత్యంత సుందరమైన ఆ పురాతన కట్టడాలను చూసి ఆశ్యర్యపోతుంటారు. భారతీయ శిల్ప కళా వైభవాలకు మైమరిచిపోతుంటారు. అయితే దేశంలో ఎన్నో  పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. శాస్త్ర సాంకేతిక రంగాలు, మానవ మేధస్సు ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ ఇలాంటి కట్టడాలను తిరిగి పునఃనిర్మించలేమంటే అతిశయోక్తి కాదు. దేశంలోని 10 అద్భుత కట్టడాలు మీకోసం..

    1. తాజ్‌మహల్‌

    భారత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్‌. ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్‌మహల్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని యూనెస్కో 1983లోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. మెుఘల్‌ రాజు షాజహాన్‌ రాణి ముంతాజ్‌ కోసం దీనిని నిర్మించాడు. ఈ నేపథ్యంలో ప్రేమికులకు చిహ్నంగా తాజ్‌మహల్‌ మారిపోయింది. మెుఘల్‌ సామ్రాజ్య శిల్ప కళకు అద్దం పట్టే ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 

    2. అజంత-ఎల్లోరా గుహలు

    మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అజంత-ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇవి ప్రపంచ ప్రసిద్ధ గుహలుగా గుర్తింపు పొందాయి. భారీ కొండను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. ఎల్లోరా గుహలను  5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య నిర్మించారు. అజంతా గుహలను రెండు విభిన్న కాలాల్లో కాలానికొక దశ చొప్పున నిర్మించారు. ఇందులో తొలి దశ నిర్మాణం క్రీ.పూ 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 1వ శతాబ్దం వరకూ జరిగిందని చెప్తారు. ఈ రెండు గుహలను భూమిపై ఉన్న అద్భుతమైన చారిత్రాత్మక నిర్మాణాలుగా చెప్పొచ్చు. ఇటువంటి పురాతన కట్టడాన్ని ఈ రోజుల్లో నిర్మించడం అసాధ్యమనే చెప్పాలి. 

    3. కోణార్క్ సూర్యదేవాలయం

    ఒడిశాలోని కోణార్క్‌ సూర్యదేవాలయాన్ని క్రీ.శ. 1236-1264 మధ్య నిర్మించారు. తూర్పు గంగా రాజవంశపు రాజు మెుదటి నరసింహదేవ.. నల్ల గ్రానైట్‌తో దేవాలయాన్ని కట్టించారు. 24 చక్రాలు కలిగిన ఓ రథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లు గుడిని నిర్మించారు. సూర్యభగవానుడు ఈ రథంపై కొలువుదీరి ఉంటాడు. ప్రతిరోజూ సూర్యకిరణాలు ఈ ఆలయం ముఖ ద్వారాన్ని తాకుతాయి. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ఉండే రెండు సింహపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్నట్టుగా దర్శనమిస్తాయి. పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. 

    4. హంపి

    ప్రాచీన భారతదేశ వాస్తు కళా వైభవానికి సంబంధించిన ప్రతీ నిర్మాణం… కర్ణాటకలోని హంపీలో ఉంది. 14వ శతాబ్దం నాటి శిథిలాల్లో భద్రంగా దాగి ఉన్నాయి. అందుకే హంపిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా యూనెస్కో గుర్తించింది. విజయనగర సామ్రాజ్య వాస్తుకళను హంపి కళ్లకు కడుతుంది. హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధానిగా ఉంది. అలాగే ఈ ప్రాంతం చాళుక్య, పాండ్య రాజుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని తెలియజేస్తుంది. 14, 16వ శతాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రపంచ ప్రసిద్ద పర్యాటకులు హంపి గురించి తమ పుస్తకాల్లో చాలా గొప్పగా రాశారు. 

    5. గోల్కొండ కోట

    హైదరాబాద్‌లోని గోల్కొండ కోట దేశంలోని అతి పురాతన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కుతుబ్ షాహీ వంశస్తులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి కట్టించారు. 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రుదుర్భేధ్యంగా దీనిని నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిపి సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఒకసారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు. హైదరాబాద్‌ విజిట్‌కు వచ్చే వారంతా తప్పనిసరిగా గోల్కొండను చూసి వెళతారు. 

    6. చార్మినార్

    హైదరాబాద్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసే ప్రదేశాల్లో చార్మినార్ కూడా ఒకటి. ఈ కట్టడం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఛార్మినార్ ను నిర్మించారు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి ఛార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. మతాలు వేరైనా మనుషులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండే వాతావరణానికి చార్మినార్ అద్దం పడుతుంది. 

    7. మీనాక్షి 

    దేశంలోని అత్యంత చారిత్రక దేవాలయాల్లో తమిళనాడులోని మధుర మీనాక్షి టెంపుల్ ఒకటి. పాండ్య రాజుల శిల్ప కళావైభవానికి మీనాక్షి టెంపుల్‌ అద్దం పడుతోంది. 15 ఎకరాలల్లో  విస్తరించిన ఈ ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ తన్మయత్వంలో మునిగితేలుతారు. ముఖ్యంగా ఆలయం మధ్యలో ఉండే కోనేరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

    8. అంబర్‌ఫోర్ట్‌

    రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న 16వ శతాబ్దం నాటి అంబర్‌ ఫోర్ట్‌ దేశంలోని ప్రసిద్ధ కోటల్లో ఒకటిగా ఉంది. రాజపుత్ర శిల్పకళా నైపుణ్యానికి ఈ కోట అద్దం పడుతోంది. ప్రసిద్ధ రాజపుత్ర రాజు రాజా మాన్‌ సింగ్‌ కోట నిర్మాణాన్ని 1558లో కోట నిర్మాణాన్ని చేపట్టారు. రాజస్థాన్‌ పర్యాటక రంగ అభివృద్ధిలో ఈ కోట విశేష పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాదిమంది పర్యాటకులు కోటను సందర్శించి రాజపుత్రుల వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. 

    9. మైసూర్ ప్యాలెస్

    దేశంలోని అతిపెద్ద, పురాతన రాజభవనాల్లో మైసూర్ ప్యాలెస్‌ ఒకటి. ఒకప్పుడు మైసూరును పాలించిన ఒడయార్లు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. తమ నివాస భవనంగా చేసుకొని పరిపాలన చేశారు. బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కల్యాణ మండపం ఈ ప్యాలెస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర ఇండో-యూరోపియన్‌  శైలిలో చెక్కిన శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

    10. స్వర్ణ దేవాలయం

    సిక్కుల అత్యంత పవిత్రమైన ప్రాంతంగా స్వర్ణ దేవాలయం కీర్తింపబడుతోంది. చెరువుకు మధ్యలో ఉండే ఈ ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్వర్ణం దేవాలయం నాలుగు ద్వారాలను కలిగి ఉంది. ఆలయంలోని గోడలన్నీ కలపతో చేసిన చిత్ర కళలతో అలకరించబడి ఉంటాయి. వీటిని బంగారం, వెండితో అత్యంత సుందరంగా పొదిగారు.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv