‘అల్లు అర్జున్’… ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్ చేసి పాన్ ఇండియన్ స్టార్. ఐకాన్ స్టార్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్ వాల్యూలో ఇండియాలో టాప్-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
తొలి అడుగు
28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్ చేసిన అంశాలేంటో చూద్దాం.
కథల ఎంపిక
గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్. అల్లు అర్జున్ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
డ్యాన్స్
మరో మాట లేకుండా ఇండియాలోని హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.
సుకుమార్
అల్లు అర్జున్ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అల్లు అర్జున్ చేసిన అద్భుతమైన పాత్రలు
అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి
ఆర్య
సుకుమార్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్ అని చెప్పాలి.
బాల గోవింద్
అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్ ఉంటుంది. ఇందులో బాలగోవింద్ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి.
గోన గన్నారెడ్డి
స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు.
కేబుల్ రాజు
క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్ రాజు. ఎంతోమంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు కనెక్ట్ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి.
పుష్ప
ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర.
ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ కష్టపడుతున్నారు. సుకుమార్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.