విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలో పరుగులు వరద పారించగల సత్తా ఉన్న ఆటగాడు. రికార్డుల్లో తన పేరు ఉండటం కాదు.. తన పేరు మీదే రికార్డులు ఉంటాయనడానికి నిదర్శనం. మైదానంలో సహజంగానే కోహ్లీ కాస్త హైపరాక్టివ్‌గా ఉంటాడు. దూకుడుగా ఉంటూ జట్టులో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, కొన్నిసార్లు కోహ్లీ లయ తప్పుతున్నాడేమోనని అనిపించక మానదు. అందుకే రికార్డుల మాదిరే.. వివాదాలు కూడా ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ తన ప్రవర్తనతో విరాట్ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు.
గంభీర్‌తో..
టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌కు, విరాట్‌కు మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. 2013లో ఐపీఎల్ సందర్భంగా వీరిద్దరూ గొడవపడ్డారు. అప్పటినుంచి విరాట్ ఫామ్‌లో లేని సమయంలో గంభీర్ ఎన్నో విమర్శలు చేశాడు. కొన్నిసార్లు అవసరం లేకపోయినా గంభీర్ తన విద్వేషాన్ని బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నేరుగా బాహాబాహీకి దిగింది మాత్రం ఐపీఎల్‌లోనే. మే 1న జరిగిన ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో వీరిద్దరూ ఒకరిమీద మరొకరు నోరు పారేసుకున్నారు. కాసేపు మాటలతో తగువులాడుకున్నారు. ఉరిమి ఉరిమి చూసుకున్నారు. మ్యాచ్ ముగిశాక లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్‌తో విరాట్ మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి తమ ప్లేయర్‌ని పక్కకు తీసుకెళ్లాడు. దీంతో కోహ్లీ ఏదో అన్నట్లుగా కనిపించింది. గంభీర్ వెనక్కి తిరిగి మీదమీదకి వెళ్లాడు. కేఎల్ రాహుల్ గంభీర్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
గంగూలీతో..
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో విరాట్‌కి పెద్ద శత్రుత్వమే నడిచింది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి గంగూలీ కావాలనే తొలగించాడని మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఆరోపించారు. దీంతో నాటి నుంచి గంగూలీపై కోహ్లీ గుర్రుగా ఉన్నాడు. తాజాగా ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య పొరపచ్చాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డగౌట్‌లో కూర్చున్న గంగూలీ వైపే విరాట్ తదేకంగా చూశాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది కరచాలనం చేసుకుంటుండగా గంగూలీని చూసి పాంటింగ్‌తో ముచ్చటను కొనసాగించాడు. దీంతో గంగూలీ వేచి చూడలేక ఇతర ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం గమనార్హం.
కుంబ్లేతో..
టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి, విరాట్‌కి మధ్య అస్సలు పొసగలేదు. ఒకరకంగా కుంబ్లే కోచ్ పదవి ఊడటానికి కారణం కోహ్లీయేననే వాదనలు ఉన్నాయి. కుంబ్లేని తొలగించాలంటూ బోర్డుకు ఈమెయిల్ పంపించినట్లు కూడా అప్పట్లో చర్చ జరిగింది. తన కోచింగ్ శైలితో కోహ్లీ సంతృప్తిగా లేడని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక కుంబ్లే బాహాటంగానే వెల్లడించాడు. 2017లో ఈ వృత్తాంతం చోటు చేసుకుంది.
ఆటమధ్యలో..
విరాట్ మైదానంలో ఆటగాళ్లతో వాగ్వాదం జరిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లక్నోతో మ్యాచ్‌లో గంభీర్‌తో గొడవకు బీజం ఇక్కడే పడింది. లక్నో ఇన్నింగ్స్ జరుగుతుండగా 18వ ఓవర్లో ఆ జట్టు బ్యాటర్ నవీన్ ఉల్ హక్‌తో కోహ్లీ వాగ్వాదం పెట్టుకున్నాడు. తన షూని చూపిస్తూ కొడతా అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో అడ్డుకున్న అమిత్ మిశ్రాతో సైతం కోహ్లీ మాటల పోరుకు దిగాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టాయి.
సూర్యకుమార్ యాదవ్..
టీమిండియా మరో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కి కూడా కోహ్లీతో ఓసారి ఇలాంటి అనుభవం ఎదురైంది. గతేడాది ముంబై, ఆర్సీబీ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరూ పోటాపోటీగా ఉరిమి ఉరిమి చూసుకున్నారు. ఎవరికి వారు తగ్గేదెలే అంటూ కన్నెర్ర చేసుకున్నారు. కానీ, మాటల పోరుకు దిగలేదు. అయితే, వీరిద్దరి మధ్య మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది.
విదేశీ ఆటగాళ్లతో..
ఆటపై కోహ్లీకి ఎంతో మక్కువ. అందుకే ప్రతి చిన్న విషయాన్ని సంబరంగా జరుపుకొంటాడు. అంతే స్థాయిలో పరాభవాన్ని ఫీల్ అవుతాడు. ఇలా విదేశీ ఆటగాళ్లతో కొన్నిసార్లు కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. 2021 ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా ఆ జట్టు బౌలర్ అండర్సన్‌ని కోహ్లీ బూతులు తిట్టాడు. ఇదేమీ నీ పడకగది కాదంటూ నోరు జారాడు. 2017లో ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తోనూ మాటల పోరుకు దిగాడు.
జర్నలిస్టుతోనూ..
2015 వన్డే వరల్డ్‌కప్ సమయంలో కోహ్లీ ఓ జర్నలిస్టును దూషించాడు. విరాట్, అనుష్క శర్మల బంధంపై ఓ జర్నలిస్టు ఆర్టికల్ రాశాడు. దీంతో ఈ కథనం తనే రాశాడని అనుకొని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్టును దూషించాడు. తీరా చూస్తే అది తను కాదని తేలింది. అనంతరం ఆ జర్నలిస్టుకు కోహ్లీ సారీ చెప్పినట్లు సమాచారం.
కోహ్లీ మాటేంటంటే..?
లక్నోతో మ్యాచ్‌లో వాగ్వాదం అనంతరం కోహ్లీ తన ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ‘మనం వినే ప్రతీ మాట.. ఒకరి అభిప్రాయమే. మనం చూసే ప్రతి సన్నివేశం ఒక దృక్పథమే. వాస్తవం కాదు.’ అంటూ ఓ కవి చేసిన వ్యాఖ్యలను జోడించాడు. దీంతో తనవైపు తప్పేమీ లేదని కోహ్లీ పరోక్షంగా చెప్పాడు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!