టాలీవుడ్లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్ పేరు మరోమారు మార్మోగుతోంది.
రూ. 2 కోట్లు విరాళం
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్ టీమ్ ప్రకటించింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్ రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
అండగా సెలబ్రిటీలు!
ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.
గతంలోనూ ఇలాగే..
కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.
డైరెక్టర్స్‌కు భారీ విరాళం
ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రభాస్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి