మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్ హిట్ కొట్టిన తేజ్ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ చేరిపోయాడు. అదే ఏడాది పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు.
ధైర్యాన్నే కవచంగా..
సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. నేడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్ బ్యాక్ సైడ్ లుక్‌ను చూపించారు.
రాయలసీమ నేపథ్యంలో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు తాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
యాక్సిడెంట్‌తో కోమాలోకి..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!