Contents
- 1 ఆదిలోనే ఆటంకం
- 2 అమ్మోరి దయ
- 3 స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ
- 4 మల్లన్న సాగర్
- 5 టీ హబ్ 2.0
- 6 యాదాద్రీశుడి సంప్రోక్షణ
- 7 బాక్సింగ్ క్వీన్
- 8 ప్రాణహిత పుష్కరాలు
- 9 చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్
- 10 రగిలిపోయిన సికింద్రాబాద్
- 11 బాసర ఆందోళనకు దిగొచ్చిన కేటీఆర్
- 12 పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
- 13 ఉప్పల్ మ్యాచ్
- 14 క్యాసినో కలకలం
- 15 వికటించిన ఆపరేషన్లు
- 16 మునుగోడు ఉపఎన్నిక
- 17 ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
- 18 కొలువుల జాతర
- 19 తెరాస టూ భారాస
- 20 కాంగ్రెస్‌లో ముసలం
- 21 ఫార్ములా రేసింగ్
ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం.
అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ స్థాయిలోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్. ఇలా రెండో అర్థభాగం ముగింపు దశకు వచ్చింది.
ఆదిలోనే ఆటంకం
ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. దీంతో పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాయి.
అమ్మోరి దయ
రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. దాదాాపు 100 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్ దగ్గరుండి పనులు పర్యవేక్షించి జాతరను విజయవంతం చేశారు. కోలాహలంగా సాగిన జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వచ్చారు.
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ
శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమమైన ముచ్చింతల్‌లో రామానుజాచార్య 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇందులో 108 దివ్య దేవాలయాలను అచ్చుగుద్దినట్లు వాస్తవిక ఆలయాలకు తగినట్లు రూపకల్పన చేయడం అద్భుతం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని నామకరణం చేశారు. సుమారు 1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
మల్లన్న సాగర్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రిజర్వాయర్లలోనే అతి పెద్దది. 50 TMCల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా తొగుట-కొండపాక మండలాల శివారులో మల్లన్న సాగర్ నిర్మించారు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ జలాశయం నీటితో మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో చెప్పిన కేసీఆర్ అనుకున్నట్లుగానే స్వామివారి పాదాలను గోదావరి జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశాడు.
టీ హబ్ 2.0
అంకురాలకు నిలయంగా మారుతున్న హైదరాబాద్‌లో మరిన్ని అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి తీసుకువచ్చిందే టీ హబ్ 2.0. సుమారు రూ. 400 కోట్లతో రెండే దశ పనులను పూర్తి చేసి 1500 కంపెనీలు నెలకొల్పడానికి అవసరమైన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించి దేశ యువతకు అంకితమిచ్చారు. చార్మినార్ నిర్మాణ శైలి ఆధారంగా దీనిని నిర్మించడం జరిగింది. కేవలం నాలుగు పిల్లర్లపైనే ఆధారపడి ఉంటుంది.
యాదాద్రీశుడి సంప్రోక్షణ
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం పూర్తైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఆచారాల ప్రకారం ప్రారంభించారు. సంప్రోక్షణ, యాగాలు జరిపించి ఆలయానికి సరికొత్త రూపం తీసుకువచ్చారు. భక్తులకు కొత్తగా నిర్మించిన గుడిలో దర్శనాలకు అవకాశం కల్పించారు. రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఇది చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది.
బాక్సింగ్ క్వీన్
కామన్ వెల్త్ గేమ్స్‌లో హైదరాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ ఓ సంచలనం. ఫైనల్స్‌లో విజయకేతనం ఎగురవేసి గోల్డ్ మెడల్ సాధించింది . నిజామాబాద్‌లో పుట్టిన ఈ చిరుతపులి తన పంచ్‌తో రికార్డుల మోత మోగించింది.
ప్రాణహిత పుష్కరాలు
రాష్ట్రంలో 12 ఏళ్లకు ఒకసారి ప్రాణహిత పుష్కరాలు వస్తాయి. ఏప్రిల్‌లో దాదాపు 12 రోజుల పాటు జరిగిన పుణ్యస్నానాలకు కోట్లలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించింది.
చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్
తెలంగాణ హైకోర్టుకు ఈ ఏడాది కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. జూన్‌లో జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
రగిలిపోయిన సికింద్రాబాద్
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ నియామకాల్లో ఒప్పంద ప్రాతిపదికను ప్రవేశ పెట్టడంతో దేశవ్యాప్తంగా దుమారమే రేపింది. దీనిపై నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మారణహోమం సృష్టించారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన ప్రదర్శన చేశారు. ఆగ్రహావేశాలతో రైలుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో RPF బుల్లెట్ల వర్షం కురిపించటంతో రాకేశ్ అనే ఆశావాహి మృతిచెందాడు. అతడు జనగామ జిల్లా వాసి కావడంతో ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. అధికార పార్టీ తెరాస మద్ధతు పలకడంతో మరింత తీవ్రమయ్యింది. దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రంలో రణరంగమే జరిగింది.
బాసర ఆందోళనకు దిగొచ్చిన కేటీఆర్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన పోరాటం ఈ ఏడాది ప్రకంపనలు సృష్టించింది. రోజుల తరబడి ఎండా, వాన లెక్క చేయకుండా విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారానికి భీష్మ పట్టు పట్టారు. కేసీఆర్, కేటీఆర్ వచ్చేదాకా పోరాటం ఆపేది లేదంటూ మెుండికేశారు. దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. అంతేనా, మంత్రి కేటీఆర్ యూనివర్సిటీని సందర్శించి ఇబ్బందులు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం తగు చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలపడం కొసమెరుపు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని శాఖలను అనుసంధానిస్తూ అత్యాధునిక సాంకేతికతతో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 4న ప్రారంభించారు. హైదరాబాద్ బంజాారాహిల్స్లో 20 అంతస్థుల్లో నిర్మించారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలన్నింటి అనుసంధానం జరిగింది. అంతేకాదు, ఒకేసారి లక్ష కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెర అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుందనే సమాచారాన్ని క్షణాల్లో పసిగట్టవచ్చు. విపత్తుల వేళ వేగంగా స్పందించేలా కార్యచరణ రూపొందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. ఇందుకోసం సాధారణ రుసుం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ్నుంచి హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.
స్వతంత్ర వజ్రోత్సవాలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని అమృత్ మహోత్సవాలకు పిలుపునిచ్చారు. కానీ, అప్పటికే కేంద్రంతో పొసగకపోవటంతో కేసీఆర్ స్వతంత్ర వజ్రోత్సవాలనే మాట తెరపైకి వచ్చింది. ఆగస్టు 8న వేడుకలు ప్రారంభించి జాతీయ జెండాల ప్రదర్శన, సామూహిక జాతీయ గీతాలాపన, ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ, ఫ్రీడం రన్, ఫ్రీడం ర్యాలీలు వంటి కార్యక్రమాలు 15 రోజుల పాటు అంటే ఆగస్టు 22 వరకు హోరెత్తాయి. దేశభక్తిని ఎలిగెత్తి చాటాయి.
ఉప్పల్ మ్యాచ్
కరోనా కారణంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. సెప్టెంబర్‌లో జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా హైస్కోరింగ్ గేమ్ అలరించింది. అంతేకాదు, ఈ మ్యాచ్ ఎన్నో వివాదాలకు కూడా దారితీసింది. టికెట్ల అమ్మకంలో గందరగోళం నెలకొనడం. హెచ్‌సీయూ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై విమర్శలు. ఇలా వెరసి టికెట్ల కోసం వెళ్లి జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో కొందరు గాయపడటంతో మంత్రి దాకా విషయం చేరింది. చివరకు వివాదం సద్దుమణిగింది. విజయవంతంగా మ్యాచ్‌ను నిర్వహించారు.
క్యాసినో కలకలం
హైదరాబాద్‌లో క్యాసినో వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా తీసుకెళ్లారని అనుమానాలు. ఇందులో చాలామంది మంత్రులు, బడా నేతల పేర్లే వినిపించాయి. చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్, అతడి పెంపుడు జంతువులు అప్పుడు ఎంతో ఫేమస్. ఈ కేసు తెలంగాణను ఓ ఊపు ఊపేసింది.
వికటించిన ఆపరేషన్లు
తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. స్టెరిలైజేషన్ సరిగా చేయని కారణంగా మృతిచెందటం కలకలం రేపింది. టార్గెట్ కారణంగానే జరిగాయని ఆరోపణలు రాగా..విచారించిన కమిటీ సిబ్బంది నిర్లక్ష్యమని తేల్చింది. దీంతో డాక్టర్‌తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
మునుగోడు ఉపఎన్నిక
కోమటి రెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకోవటంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. అప్పటికే వివిధ అంశాల కారణంగా తెరాసకు వ్యతిరేకత పెరుగుతున్న తరుణం. ఈ సమయంలో ఉపఎన్నిక తెరాసకు ఓ వరంలా మారింది. భాజపాను దెబ్బకొట్టాలనుకున్న కేసీఆర్ ప్రణాళికలు ఫలించాయి. మంత్రి కేటీఆర్ దత్తత హామీ, జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గ సమ్మెళనాలు, వామపక్షాల మద్దతుతో తెరాస జయకేతనం ఎగురవేసింది. ఇద్దరు నేతలు కోట్లు గుమ్మరించారని ఓటుకు రూ. 5 వేల పైనే పంచారని ప్రచారం.
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు తెరాస ఇచ్చిన హామీల్లో ఒకటి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు. కానీ, ఆచరణ సాధ్యం కాలేదు. కేంద్రం మెుండిచేయి చూపిస్తుందంటూ నాన్చుతూ వచ్చిన కేసీఆర్..ఉపఎన్నిక సమయంలో ఆ బిల్లును ఆమోదించారు. తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. రిజర్వేషన్లు అందరివీ కలిపి 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనను కాదని చేశారు. మరి ఇవన్నీ ఎలా ఆచరలోకి వస్తాయో చూడాలి మరి.
కొలువుల జాతర
నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో ఎట్టకేలకు నియామకాల జాతర ప్రారంభమయ్యింది. దాదాపు 80వేలకుపైగా ఉద్యోగ ఖాళీలు నింపుతున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆచరణలోనూ అంతేవేగంతో వెళ్తున్నారు. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1 నోటిఫికేషన్లు వెలువడగా..గ్రూప్ 4 కూడా వచ్చేసింది. గ్రూప్ 2,3 భర్తీ చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారు.
తెరాస టూ భారాస
కేంద్రం వైఖరిని చాలా రోజులుగా తప్పుపడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేశారు. కొన్ని ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి జాతీయ పార్టీ నెలకొల్పారు. దిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభమయ్యింది. భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం పూర్తయ్యింది. దేశ రాజకీయాల్లోనూ రైతు సంక్షేమమే ప్రధాన ఎంజెడాగా కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది నినాదం. దీనిపై ప్రతిపక్షాల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్‌లో ముసలం
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటీ నుంచి కాంగ్రెస్‌లో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్‌పై ఫైర్ అయ్యాడు. రాజీనామా దాకా వ్యవహారం వెళ్లింది. మాణిక్కం ఠాగూర్ డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల పదవుల విషయంలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేతలు రచ్చకెక్కారు. అసలు కాంగ్రెస్ మేమేనంటూ విమర్శలు గుప్పించారు. శ్రేణులకు అన్యాయం జరిగితే ఎక్కడిదాకైనా వెళ్తామని తెగించి చెప్పేశారు. ఇందులో భాగంగా కొందరి రాజీనామాలు కలకలం రేపాయి.
ఫార్ములా రేసింగ్
అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫార్ములా రేసింగ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. నెక్లెస్ రోడ్లో జరిగిన పోటీల్లో తొలుత అపశృతి చోటు చేసుకోవటంతో రద్దు చేశారు. తర్వాత మళ్లీ ప్రారంభించి కొంత గందరగోళ పరిస్థితుల్లోనే పూర్తి చేశారు. కానీ, ఎట్టకేలకైతే విజయవంతంగా ముగిసింది. ఇందులో హీరోలు రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్ సందడి చేశారు. ఒక సాధారణమైన రోడ్డును రేసింగ్ ట్రాక్‌లా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే చేసింది.
వీటన్నింటితో పాటు రాజకీయంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఈ ఏడాది ప్రకంపనలే సృష్టించాయి. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, విజయదేవరకొండ, పూరీ, ఛార్మీలకు ఐటీ నోటీసులు, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు అప్పుడప్పు డ్రగ్స్ వ్యవహారం ఇలా చాలానే మిస్టరీలు ఈ ఏడాదీ హిస్టరీలుగా మారాయి.