ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రత్యర్థులుగా మారారు. ముఖ్యంగా బన్నీ.. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి మెగా ఫ్యాన్స్‌కు, జన సైనికులకు షాకిచ్చాడు. సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. మరోవైపు అదే సమయంలో చిరు తనయుడు రామ్‌చరణ్.. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించి బాబాయి గెలుపునకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుత ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీ రెండు విడిపోయిందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఫ్రెండ్ కోసం బన్నీ!
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నంద్యాలకు వెళ్లాడు. దీంతో బన్నీ వ్యవహార శైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇటీవల ట్విటర్‌లో పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ.. పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్ బరిలో ఉన్నారు.
బన్నీకి ఘన స్వాగతం
భార్య సతీమణితో కలిసి నంద్యాల వచ్చిన బన్నీకి వైకాపా అభ్యర్థి శిల్పా రవి దంపతులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బన్నీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నంద్యాల రోడ్లపైకి చేరుకున్నారు. అతడి రేంజ్ రోవర్ కారును చుట్టుముట్టారు. వేలాది అభిమానుల మధ్య శిల్ప ఇంటికి చేరిన బన్నీ.. బాల్కనీ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అవి చూసిన జనసైనికులు బన్నీ చర్యపై మండిపడుతున్నారు. బన్నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.
చంద్రబాబు రియాక్షన్
నంద్యాలలో బన్నీ పర్యటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పందించాడు. స్నేహితుడని భావించి అల్లు అర్జున్ వైకాపా అభ్యర్థి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పట్టుకొని వైకాపా చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ వెంట ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
పిఠాపురంలో రామ్‌చరణ్
జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో గత కొన్ని రోజులుగా తారల సందడి నెలకొండి. పవన్‌కు మద్దతు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్ కోసం తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌చరణ్ పిఠాపురం వెళ్లాడు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన రామ్‌చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. కేరంతలు, ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన చరణ్.. పట్టణంలో పర్యటిస్తున్నారు. కాగా, నేటితో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.