మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
నిర్మాత ఏమన్నారంటే!
జూ.ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆయ్‘ (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్ క్లౌడ్స్’ అని సమాధానం ఇచ్చారు.
వివాదానికి కేంద్ర బిందువు ఇదే!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.
అల్లు అర్జున్ vs రామ్‌చరణ్
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కూడా ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్ ఛేంజర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద ‘బన్నీ vs చరణ్’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సుకుమార్‌తో కోల్డ్‌వార్?
‘పుష్ప: ది రూల్’ షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!