టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అత్యున్నత గౌరవాన్ని పొందారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మిగతా ప్రముఖులేవరో ఇప్పుడు చూద్దాం.
రామోజీరావు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు గారు, గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈనాడు పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా ఎంతో సేవ చేశారు.
దాసరి నారాయణ రావు
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, దాసరి నారాయణరావు గారు రికార్డు సృష్టించారు. ఈ ఘనతతో అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలు అని ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠి, మలయాళం భాషల్లో సుమారు 40,000కి పైగా పాటలు పాడారు. ఈ విషయంలో కూడా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. బాలు సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ప్రసిద్ధి పొందారు.
దగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రామానాయుడు, మూవీ మోఘల్‌గా ప్రసిద్ధి చెందారు. 100 చిత్రాలకు పైగా నిర్మాతగా నిలిచిపోయి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం పథ్మ భూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.
విజయనిర్మల
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల, 44 చిత్రాలను దర్శకురాలిగా తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 2002లో గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2019లో ఆమె మరణించారు.
పి. సుశీల
భారతీయ సినీ పరిశ్రమలో 60 సంవత్సరాల పైగా ప్రసిద్ధి పొందిన గానకోకిల పి. సుశీల, 12 భాషల్లో దాదాపు 30,000 పాటలు పాడారు. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. భారత ప్రభుత్వం ఆమెకు పథ్మభూషణ్ అవార్డు అందించింది.
బ్రహ్మానందం
కన్నెగంటి బ్రహ్మానందం, ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు, ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించారు. ఆయన పూర్తి సమర్థవంతంగా 1250 సినిమాలకు పైగా నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించారు.