కరోనా తర్వాత సినీరంగ స్వరూపమే మారిపోయింది. సినిమాలు లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి, థ్యాంక్యూ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ చిత్రాలకు కూడా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాల విడుదల, పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ కారణంగా భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు, పెరిగిన టికెట్ల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. అయితే ఉన్నఫళంగా దిద్దుబాటు చర్యలకు నిర్మాతలు నడుం బిగించారు. ఈ రెండు మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకునేందుకు ముందుకొచ్చారు. అసలు నిర్మాతల సమస్యలు ఏంటి? టాలీవుడ్ లో ఏం జరుగుతోందో చూద్దాం
నష్టాలకు కారణమేంటి?
కరోనా కారణంగా సినీరంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో నష్టాలను పూడ్చుకునేందుకు చేపట్టిన చర్యలు మొదటికే మోసం తెచ్చాయి. టికెట్ల ధరలు అమాంతం పెంచడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మరింత నష్టాలను మూటగట్టాయి. విడుదలైన సినిమా వారం, పది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంటే థియేటర్ కు వెళ్లి రూ.300-500 వరకు ఖర్చు చేసేందుకు జనం ముందుకు రాకుండా పోయారు. దీనికి తోడు పాన్ ఇండియా సినిమాలతో భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మరింత శాపంగా మారాయి. వీపీఎఫ్ చార్జీలు, ప్రొడక్షన్ కాస్ట్ అమితంగా పెరిగిపోయాయి. జనాలు ఓటీటీలకు అలవాటు పడటంతో సినిమా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సినిమాలో అద్భుతమైన కంటెంట్, కొత్తదనం లేనిదే థియేటర్ కు వెళ్లని పరిస్థితి నెలకొంది.
నిర్మాతల సమస్యలేంటి? ఏం నిర్ణయాలు తీసుకున్నారు?
పెరిగిన ప్రొడక్షన్ కాస్ట్ తో సినిమాల కంటెంట్, క్వాలిటీ తగ్గుతోందని అందువల్ల మంచి సినిమాలు తీయడం కష్టమవుతోందని నిర్మాతలు చెబుతున్నారు. సినిమా బడ్జెట్ లో 30 శాతం దాకా హీరోల రెమ్యూనరేషన్ ఉండటం భారంగా మారుతోందని వారి ఆవేదన. సినిమాతో హీరోలు తప్ప ఎవరూ బాగుపడటం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు బాహాటంగానే విమర్శించారు.
అలాగే ఓటీటీల ప్రభావం గట్టిగా ఉంది. భారీ సినిమాలను అంత త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల థియేటర్లకు జనం రావట్లేదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే కలెక్షన్లపై మేనేజర్లు, కో-ఆర్డినేటర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తప్పుడు లెక్కల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు నష్టం వాటిల్లుతోందని, హీరోల రెమ్యూనరేషన్ పెంపునకు కారణవుతోందని చెబుుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుపుతున్న నిర్మాతల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
- ఇకపై భారీ బడ్జెట్ చిత్రాలను 10 వారాల తర్వాతే OTTకి ఇవ్వాలని నిర్ణయించారు.
- పరిమిత బడ్జెట్ సినిమాలు 4 వారాల్లోపు ఓటీటీకి ఇవ్వవచ్చు
- రూ.6 కోట్ల లోపు బడ్జెట్ చిత్రాలపై ఫెడరేషన్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి
- సినిమా ప్రదర్శించేందుకు చెల్లించే వీపీఎఫ్ చార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలని నిర్ణయించారు.
- సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మల్టిప్లెక్స్ లలోనూ గరిష్ఠంగా రూ.170 మించకుండా ఉండాలని నిర్ణయించారు.
- మేనేజర్లు, కో-ఆర్డినేటర్ల వ్యవస్థను పూర్తిగా తీసివేయాలని నిర్ణయించారు.
- హీరోలు, హీరోయిన్లు అసిస్టెంట్ల ఖర్చులు ఎవరికి వారే భరించాలి.
- సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభించేదాకా ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు బంద్ చేయాలని నిర్ణయించారు.
హీరోలు ఏమంటున్నారు?
హీరోలు సైతం దిద్దుబాటు చర్యలకు ముందుకొస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో చర్చలు జరిపారు. తమ రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు ఈ తారలు సుముఖత వ్యక్తం చేశారు. ఇతర హీరోలతోనూ రామ్ చరణ్ మాట్లాడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ల ఖర్చులు స్వయంగా భరించడంపైనా హీరోలు ఓకే చెప్పినట్లు సమాచారం. చిరంజీవి సైతం నిర్మాతలకు లేఖలు రాశారు. హీరోలతో నిర్మాతల చర్చలు ఇంకా కొనసాగే అవకాశముంది.
షూటింగులు ఆపడం మంచిదేనా?
షూటింగులు ఆపడం తాత్కాలికంగా ఇండస్ట్రీకి మేలు చేయకపోవచ్చు ఎందుకంటే దసరా రిలీజ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్, బాలయ్య సినిమాలతో పాటు ప్రాజెక్ట్ -కె, శంకర్- రామ్ చరణ్ RC15 వంటి సినిమాల షూటింగ్ ఆగిపోతోంది. దీంతో మంచి వసూళ్లు ఉండే దసరాకు సినిమాలు రాకపోవచ్చు. అయితే దూరదృష్టితోనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. సమస్యలు పరిష్కారమైతే సినిమా క్వాలిటీ పెరుగుందని, అనవసర ఖర్చులు తగ్గించి గ్రాఫిక్స్ వంటి ఇతరాలపై ఖర్చులు పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్ల బాట పట్టించగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులు కోరుకుంటున్నది ఏంటి?
నిజానికి తెర వెనక ఏం జరుగుతోందన్నది ప్రేక్షకుడికి అనవసరం. ఒక మంచి సినిమా తమ బడ్జెట్ లో చూడాలి. అది థియేటర్లో దొరికితే వెళ్తారు. లేదంటే ఓటీటీలో చూస్తారు. అక్కడా ఖరీదైతే పైరసీ చూస్తారు. అది తప్పైనా ఆపడం ఎవరికీ సాధ్యం కానిది. మరి ఇలాంటి సమయంలో తెలుగు చిత్ర సీమ త్వరగానే మేల్కొందా? వారి నిర్ణయాలు ప్రేక్షకులను థియేటర్లకు లాగుతాయా? అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, వాటి అమలుపై ఆధారపడి ఉంటుంది. మూస ధోరణి సినిమాలకు స్వస్తి పలికి, మంచి కథాంశాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు సినిమాలు వస్తే ప్రేక్షకుల మూడ్ మారొచ్చు. ఏం జరుగుతుందో కొంత కాలం వేచి చూడాల్సిందే.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి