కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2‘. గతంలో వచ్చిన ‘భారతీయుడు‘ చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్రం శుక్రవారం (జులై 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందులేక తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. ‘భారతీయుడు 2’ తమను తీవ్రంగా నిరాశ పరిచిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడు తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మిశ్రమ స్పందన ఈ సినిమా వసూళ్లపై చూపిన ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని విశ్లేషించాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై పెద్దగా ఆసక్తి కనబరచలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కలెక్షన్స్‌లో భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం ‘విక్రమ్’ (Vikram)తో పోలిస్తే ‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన ‘కల్కి 2898 ఏడీ’ తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన ‘భారతీయుడు 2’ (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.