పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ గా మలిచేవారు. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో హంగామా పూర్తిగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతావన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దక్షిణాది చిత్రాలు మెరిసిపోతుండటం, ఓటీటీ హవా కూడా పెరగడంతో అక్కడి వెండితెరకు గిరాకీ తగ్గింది. వచ్చిన సినిమా వచ్చినట్టు థియేటర్ల ముందు బోల్తా పడుతుంటే బీటౌన్‌లో తెలియని అలజడి మొదలైంది. బాలీవుడ్ చరిత్రలోనే గడ్డు కాలం నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ అగాథం నుంచి బయటవేసే ఓ వెలుగు ఇప్పుడు చిత్రసీమకు అత్యవసరంమైంది. అది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రూపంలో వస్తోంది. 9న ప్రేక్షకుడిని పలకరించేందుకు సిద్ధమైంది.
దాదాపు రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ తన కెరీర్ ను పణంగా పెట్టి తెరకెక్కించారు. ఏకంగా 10 ఏళ్లు ఈ సినిమా కోసం చెమటోడ్చాడు. 2013లో విడుదలైన ‘యే జవానీ.. హే దివానీ’ సినిమా అతడి చివరి మూవీ. ఇప్పుడు ఫాంటసీ చిత్రంతో మన ముందుకు వచ్చి.. తన ‘అస్త్ర’లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
‘బ్రహ్మాస్త్ర’ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. అగ్రతారలను చిత్రంలోకి తీసుకున్నారు. సినిమాలో నటించడమే కాకుండా.. ప్రచార బాధ్యతల్ని కూడా రణ్ బీర్, ఆలియా భుజాన వేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఆలియా తెలుగులో పాట పాడితే.. రణ్ బీర్ మన భాషలో మాట్లాడటానికి ప్రాధాన్యతనిచ్చారు. ఫాంటసీ మూవీ కావడంతో గ్రాఫిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం సింహభాగం బడ్జెట్ ని కేటాయించారు. ట్రైలర్ తో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ ట్రైలర్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది.
BRAHMĀSTRA OFFICIAL TRAILER | Telugu | Amitabh | Ranbir | Alia | Ayan | In Cinemas 9th September
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. దక్షిణాదిలో సినిమా సమర్పణ బాధ్యతల్ని రాజమౌళి తీసుకున్నారు. ఎలాగైనా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారీ స్థాయిలో ప్రచారాన్ని కల్పిస్తున్నారు. ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. తొలిసారిగా ఓ హిందీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కానీ చివరికి వీలు కాలేదు. దీంతో ప్రొడ్యూసర్లకి దాదాపు రూ.కోటిన్నర నష్టమొచ్చినట్లు తెలిసింది. అయినా దర్శకనిర్మాతలు నిరుత్సాహ పడలేదు.
ఈ సినిమాకు రాజమౌళి చరిష్మా కలిసొస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా ప్రమోషన్లలో జక్కన్న నేరుగా పాల్గొన్నారు. దక్షిణాదిలో సమర్పిస్తుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పరోక్షంగా ఈ సినిమాను దర్శకధీరుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలుగు టీవీషోల్లోనూ ఆయన రణ్ బీర్, ఆలియాతో కలిసి పాల్గొంటున్నారు. దీంతో ఆడియెన్స్ అటెన్షన్ సినిమావైపు మళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండటం దర్శకనిర్మాతల్లో ఆశలు రేపుతోంది.
Cash Latest Promo – #Brahmastra – 10th September 2022 – Ranbir Kapoor,Alia Bhatt,Rajamouli,Mouni Roy
సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి. అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.30కోట్లకు పైగా బిజినెస్ చేసేసింది. కేజీఎఫ్ 2 తర్వాత హిందీ బెల్ట్ లో ఇదే అత్యధికం. అయితే, సినిమా వీక్షకులను మెప్పించాలి. అప్పుడే ఈ విజయ పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడ పట్టాలు తప్పినా అది సినిమాకే కాదు.. బాలీవుడ్‌కే నష్టం చేకూరుస్తుంది. ఒకవేళ ఈ సినిమా థియేటర్ల వద్ద నిలబడకపోతే.. బాలీవుడ్ ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదు. ఆలోపు థియేటర్ల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ తర్వాత జరిగే పర్యావసనాలను ఊహిస్తేనే ఇండస్ట్రీకి వణుకు పుట్టిస్తోంది. మంచినే ఆశిద్దాం. సినిమా విజయం సాధించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ బ్రహ్మాస్త్ర!
BRAHMĀSTRA (Telugu) | Kumkumala Video | Ranbir | Alia | Pritam | Sid Sriram | Chandrabose