ఒకానొప్పుడు ఓ ఇరవయ్యేళ్ల కుర్రాడికి బ్యాటిచ్చి ఆడుకోమంటే…. కంగారూల కంచుకోట గబ్బా గోడలను బద్దలు కొట్టాడట. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ లో ఆ దేశ జట్టునే జుట్టు పట్టుకునేలా చేశాడంట. అతడు గ్రౌండులో అడుగు పెడితే రెండు జరుగుతాయట. ఒకటి మన టీం భయపడటం. రెండోది అవతలి టీం అంతకు మించి వణకడం, ఇదీ తోటి ఆటగాడు అతడి గురించి చెప్పిన మాట. పక్కా టీ20 ప్లేయర్ అన్న బిరుదుతో టీమిండియాలో అడుగుపెట్టి… చరిత్రలో పదిలంగా తన పేరు లిఖించుకునేలా పక్కా టెస్టు ప్లేయర్ గా ఎదుగుతున్నఆ ఆటగాడే రిషభ్ పంత్. ధోని వారసుడిగా అంతకు మించిన దూకుడుతో ఆడుతున్న పంత్ ధోనీ రికార్డులను తిరగరాయలడా అంటే అవుననే అనిపిస్తోంది. ఇంగ్లండ్ తో చివరి టెస్ట్ మ్యాచులో పంత్ ఆటకు దిగ్గజాలు సైతం ప్రశంల వర్షం కురిపించారు. అతి తక్కువ కాలంలోనే ఎన్నో మైలు రాళ్లు అధిగమించి…క్రికెట్ ప్రపంచమే నివ్వెరబోయే పలు నిఖార్సైన ఇన్నింగ్స్ ఆడిన రిషభ్ పంత్ చిన్నపాటి టెస్ట్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.
కెరీర్ గురించి టూకీగా
2018లో టెస్టు ప్రపంచ టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్ ఇప్పటిదాకా 31 మ్యాచులు ఆడి 2123 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉండగా.. ఒక్కటి మాత్రమే ఇండియాలో చేశాడు. మిగతా 4 సెంచరీలు విదేశాల్లోనే బాదాడు. బెస్ట్ స్కోర్ సిడ్నీలో ఆస్ట్రేలియా మీద కొట్టిన 159*.
పంత్ ప్రతి సెంచరీ ప్రత్యేకమే
ఇక అంతా అయిపోయిందనుకున్న వేళ వచ్చి ఇక చింతలేదు అనుకునే స్థాయికి చేర్చడంలో రిషభ్ పంత్ సిద్ధహస్తుడు. పంత్ చేసిన 5 సెంచరీల్లో 4 అలాంటి సమయంలో వచ్చినవే.
2022 బర్మింగ్ హామ్, ఇండియా vs ఇంగ్లండ్
తాజాగా జరిగిన ఈమ్యాచ్ పంత్ కెరీర్ లోనే గుర్తుండిపోతుంది. 64పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 111బంతుల్లోనే 146 పరుగులు చేసి అధిపత్య స్థానంలోకి తీసుకెళ్లాడు. పంత్ ఆటతీరుకు క్రికెట్ ప్రపంచమే దాసోహమైంది.
2018 ఓవల్, ఇండియాvsఇంగ్లండ్
ఇండియా 121 పరుగులకే 5 వికెట్లు అందులోనూ రెండు డకౌట్లతో ఉన్న స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ ఎదురుదాడికి దిగాడు. 114 పరుగులతో చెలరేగి జట్టును ఓటమి నుంచి తప్పించేదుకు ప్రయత్నించాడు.
2021, అహ్మదాబాద్ , ఇండియా vs సౌతాఫ్రికా
సొంత గడ్డపై 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్ తన వీరోచిత ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు అందించి విజయంలో భాగమయ్యాడు.
2022, జోహన్స్ బర్గ్, ఇండియా vs సౌతాఫ్రికా
సౌతాఫ్రికాతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు పంత్ తన అద్భుతమైన సెంచరీతో 223 పరుగుల గౌరవప్రద స్కోరును అందించాడు.
2019 సిడ్నీ, ఇండియా vs ఆస్ట్రేలియా
ఈ మ్యాచులో పంత్ తన కెరీర్ బెస్ట్ టెస్ట్ స్కోర్ 159తో చెలరేగాడు. పక్కాగా గెలవాల్సిన ఈ మ్యాచ్ వర్షార్పణం కావడంతో డ్రాగా ముగిసింది.
పంత్ పేరు మార్మోగేలా చేసిన ఇన్నింగ్స్
పంత్ ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను నిలబెట్టాడు. అందులో ఇటీవల ఇంగ్లండ్ జట్టుపై చేసిన సెంచరీతో పాటు 2021 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో ఆడిన రెండు ఇన్నింగ్స్ మాత్రం ఎంతో ప్రత్యేకం.
సిడ్నీలో సునామీ
అస్ట్రేలియా టూర్ లో అది మూడో టెస్ట్. ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించి గెలిచేందుకు సిద్ధంగా ఉంది. కానీ పంత్ వారికి అడ్డు తగిలాడు. ఆస్ట్రేలియా బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ…పిచ్ లో పాతుకుపోయాడు. 97 పరుగులతో పోరాడి మ్యాచ్ ను ఓటమి నుంచి గట్టెక్కించి డ్రాగా ముగిసేలా చేశాడు.
గబ్బా కంచుకోట బద్దలు
ఆస్ట్రేలియా కంచుకోట, 32 ఏళ్లుగా అసలు ఆ జట్టు ఓటమే ఎరుగని గ్రౌండ్ గబ్బా. సిడ్నీ టెస్ట్ డ్రా తర్వాత గబ్బాకు రండి చూస్కుందాం అంటూ అప్పటి ఆస్ట్రేలియన్ కెప్టెన్ టిమ్ పెయిన్ సవాల్ విసిరాడు. కానీ పంత్ పంజాకు గబ్బా గోడలు బద్దలయ్యాయి. 89 పరుగుల అత్యద్భుత ప్రదర్శనతో కంగారూల కంచుకోటలో వారికి ఓటమి రుచి చూపించడంలో పంత్ పాత్ర మరిచిపోలేనిది.
చిట్టి కెరీర్ లోనే పంత్ గట్టి రికార్డులు
- ఇంగ్లండ్ లో 2 టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి విదేశీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్
- ఇండియన్ వికెట్ కీపర్ గా ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ (89 బంతుల్లో). ఆ తర్వాత ధోనీ(93 బంతుల్లో) ఉన్నాడు
- ఆసియా అవతల టీమిండియాకు మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. మొదటి స్థానంలో సెహ్వాగ్ (78 బంతుల్లో), రెండో స్థానంలో అజారుద్దీన్ (88 బంతుల్లో) ఉన్నారు
- ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో టెస్ట్ సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్
- ఒక మ్యాచులో అత్యధిక డిస్మిసల్స్ 11, అత్యధిక క్యాచ్ లు 11
- వికెట్ కీపర్ బ్యాటర్ గా ఒక సీరీస్ లో అత్యధిక పరుగులు-517
ఆసక్తికర అంశాలు
- పంత్ 5 సార్లు 90ల్లో ఔటయ్యాడు.
- పంత్ టెస్టుల్లో అడుగుపెట్టిన నుంచి వికెట్ బ్యాటర్ ఎవరూ అతడి కంటే ఎక్కువ పరుగులు చేయలేదు.
పంత్ ను గ్రేట్ ప్లేయర్ అని, స్పెషల్ ప్లేయర్ అని, సూపర్ స్టార్ అని, స్పైడర్ మ్యాన్ అని, మోస్ట్ ఎంటర్ టైనింగ్ క్రికెటర్ అని క్రికెట్ దిగ్గజాలు అభిమానులు పిలుస్తుంటారు. 24 ఏళ్ల పంత్ కు ఇంకా బోలెడంత కెరీర్ ఉంది. ఈ ఫాం కొనసాగితే ఎవరూ అందుకోలేని రికార్డులను పంత్ నెలకొల్పడం ఖాయం. ధోనీ వారసుడిగా అంతకు మించి రాణించగలడని కూడా ఎంతో మంది దిగ్గజాలు చెప్పే మాట.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?