హైదరాబాద్‌లోని బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా 3 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద దారి మళ్లిస్తారు. అలాగే కూకట్‌పల్లి నుంచి మూసాపేట్ వెళ్లే వాహనాలను గూడ్స్ షెడ్ మీదుగా మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి అమీర్‌పేట్ వచ్చే వాహనాలను న్యూబోయిన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు.
ఎర్రగడ్డలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు జీహెచ్‌ఎంసీ నాలా పునర్నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో ఈ మూడు నెలల పాటు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ అభివృద్ధి పనుల దృష్ట్యా తప్పదని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పోలీసులు.
కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపుగా వచ్చేవాళ్లు కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకొని ఎడమవైపుగా ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, కావూరీ హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్, యూసుఫ్ గూడ, మైత్రీవనం మీదుగా అమీర్‌పేట్ వెళ్లాలి.
కూకట్‌పల్లి నుంచి బేగంపేట్ వెళ్లే ప్రయాణికులు వై జంక్షన్ నుంచి బాలానగర్ ఫ్లై ఓవర్ మీదుగా న్యూ బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి బేగంపేట ప్లై ఓవర్ ఎక్కాల్సి ఉంటుంది.
మూసాపేట్, గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట్ వచ్చే వాహనదారులు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్‌బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్యత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్డు మీదుగా మైత్రివనం చేరుకోవాలి.
బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వచ్చే వాహనాలు బాలానగర్ ఫ్లై ఓవర్ మీదుగా న్యూ బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లై ఓవర్ నుంచి అమీర్‌పేట్ వెళ్లాలి.