• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Ambedkar Statue: అంబేడ్కర్ నీడన నాలెడ్జ్ హబ్.. 125 అడుగుల ఎత్తుతో విగ్రహం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యం విజయవంతంగా పూర్తయ్యింది. యావత్ జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రూపొందించింది. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరం వెంబడి నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఆనుకొని ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులను చకచకా చేసేస్తోంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేడ్కర్‌ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి? నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చు చేశారు? వంటి ఆసక్తికర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    శంకుస్థాపన 

    దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం 2016 లోనే సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా అదే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 11.80 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్‌ స్మారక ప్రాంగణం ఏర్పాటు చేసి అందులో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే రూ. 146.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి తాజాగా పూర్తి చేశారు. గుత్తేదారు సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఈ విగ్రహాన్ని నిర్మించింది. 

    ప్రత్యేకతలు

    అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏకంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. విగ్రహ స్తూపం ఎత్తు 50 అడుగులు కాగా పీఠం వెడల్పు 172 అడుగులుగా ఉంది. విగ్రహం బరువు సుమారు 465 టన్నులు ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. విగ్రహం నిర్మాణానికి 791 టన్నుల ఉక్కు ఉపయోగించారట. అలాగే 96 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగించారు. ఈ విగ్రహం నిర్మాణం కోసం రోజూ సగటున 425 మంది కూలీలు పనిచేశారు. 

    మ్యూజియం

    అంబేడ్కర్‌ స్మారక ప్రాంగణంలో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంబేడ్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పొందుపరచనున్నారు. అంతేగాక ఓ గ్యాలరీని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఆ మహనీయుని జీవిత విశేషాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ మ్యూజియం ఏర్పాటు పనుల్లో నిమగ్నమైంది. 

    గ్రంథాలయం

    అంబేడ్కర్‌ స్మారక ప్రాంగణంలో ఓ గ్రంథాలయం కూడా ఏర్పాటు కానుంది. ఈ బాధ్యతలను కూడా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని కమిటీనే చూసుకుంటోంది. అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన ఏఏ పుస్తకాలు అందుబాటులోకి తేవాలన్న అంశంపై కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల్లో మ్యూజియం, గ్రంథాలయం పనులు పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

    పచ్చదనానికి పెద్దపీట

    స్మారకం వెలుపల అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పచ్చదనం కోసమే 2.93 ఎకరాల ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టారు. దానికి స్మృతివనం అని కూడా పేరు పెట్టారు. ఇందులో రాక్‌గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, వాటర్ ఫౌంటేన్‌, శాండ్‌ స్టోన్‌ ఉండనున్నాయి. ఈ స్మతివనంలో దాదాపు 450 కార్లను పార్క్‌ చేసేలా సౌకర్యం కల్పించనున్నారు. అలాగే బైక్‌ పార్కింగ్‌ సౌకర్యం కూడా ఉంటుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv