భారత్ ఆధ్యాత్మిక దేశంగా కీర్తింపబడుతోంది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాయి. అక్కడ లభించే ప్రసాదాలు కూడా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అయితే ప్రసాదాల విషయంలో కొన్ని దేవాలయాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ ఆలయాల్లో లభించే ప్రసాదం అమృతాన్ని తలపిస్తాయి. అందుకే ఆ టెంపుల్స్ పేరు చెప్పగానే ముందుగా ప్రసాదాలే గుర్తుకువస్తాయి. మరి దేశంలో ప్రసిద్ధ ప్రసాదాలు ఏవి?. అవి ఏ ఆలయాల్లో లభిస్తాయి? వాటికున్న ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
తిరుమల లడ్డు (ఆంధ్రప్రదేశ్)
ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల లడ్డూనే. ఈ ప్రసాదానికి సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తింటే స్వయంగా వెంకటేశ్వరుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు. అందుకే తిరుమలకు వెళ్లిన వారిని చుట్టుపక్కల వారు లడ్డు ప్రసాదం ఎక్కడని అడుగుతుంటారు.
సత్యదేవుని ప్రసాదం (ఆంధ్రప్రదేశ్)
అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో లభించే ప్రసాదం.. ఎంతో ప్రత్యేకమైంది.
గోధుమరవ్వ, నెయ్యి, బెల్లంతో తయారుచేసి విస్తరాకుల్లో అందించే దీని రుచి ఎక్కడా దొరకదు.
ఆలయంలో వ్రతం చేసిన జంట ప్రసాదం అందుకొని గానీ వెళ్లరు.
అయ్యప్ప అరవణ (కేరళ)
శబరిమలలోని అయ్యప్ప స్వామి ‘అరవణ ప్రసాదం’ దేశంలో మరెక్కడా లభించదు. బియ్యం, నెయ్యి, బెల్లంతో చేసే ఈ ప్రసాదం తింటే ఆ అయ్యప్పస్వామి అనుగ్రహం పొందినట్లేనని భక్తులు భావిస్తారు. అందుకే స్వాములు శబరిమలకు బయల్దేరినపుడు తమకూ అరవణ ప్రసాదం తీసుకురావాలని చుట్టుపక్కల వారు అడుగుతుంటారు.
పళని పంచామృతం(కేరళ)
పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకువచ్చేది ‘పంచామృతం’. అరటిపండ్లు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాట్టుసక్కరై(ఒక రకమైన బెల్లం), పటికబెల్లంతో ఈ పంచామృతాన్ని తయారు చేస్తారు. దీన్ని తిన్న భక్తులంతా ఈ ప్రసాదానికి సాటి మరోటి లేదని అంటుంటారు. ఫ్రిజ్‌లో పెట్టకుండానే మూడు నెలలపాటు నిల్వ ఉండటం పంచామృతానికి ఉన్న ప్రత్యేకతగా చెబుతారు.
ఎండిన ఆపిల్ (జమ్ముకశ్మీర్)
జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు ప్రసాదంగా డ్రైఫ్రూట్స్, ఎండిన ఆపిల్ ముక్కలను ఇస్తారు. ఈ సంప్రదాయం దేశంలో మరే దేవాలయంలో కనిపించదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టాల్స్‌లో అమ్మవారి ప్రసాదాన్ని విక్రయిస్తుంటారు.
మహా ప్రసాదం (ఒడిశా)
పూరిలోని జగన్నాథుని ఆలయంలో మహా ప్రసాదం చాలా ఫేమస్. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. వీటన్నింటిని కలిపి మహా ప్రసాదంగా పిలుస్తారు. మహా ప్రసాదం తయారీకి అతిపెద్ద పాకశాలను వినియోగిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాలగా గుర్తింపు పొందింది. ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తరువాత సువాసనలు వస్తాయని చెబుతుంటారు.