యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘హనుమాన్’గా కాంతార నటుడు!
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే ‘జై హనుమాన్’ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టితో ప్రశాంత్ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా?
‘జై హనుమాన్’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్ పాత్రకు పలానా స్టార్ హీరోను ఫైనల్ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, కేజీఎఫ్ ఫేమ్ యష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
‘కాంతార’తో పాన్ ఇండియా క్రేజ్
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘కాంతారా’ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం ‘కాంతారా చాప్తర్ 1’ (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి ‘మహా కాళీ’ (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!