కేసీఆర్, మోదీ చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలనా విధానం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. వీరిలో ఒకరిది అతి జాతీయవాదమైతే మరొకరిది అతి ప్రాంతీయవాదమని నిపుణుల విశ్లేషణ. అయితే ఎన్నికల వ్యూహాల్లోనూ వీరు ఒకేలా ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే తెలుస్తోంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ చేసిన ఆలోచననే మోదీ కూడా అమలుచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
నియామకాలపై నిశ్శబ్ధం వీడి మోత మోగేలా కేసీఆర్ ప్రకటన:
ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటారు. తానేం చేయబోతున్నారో విపక్షాలకు కనీసం తెలియనివ్వకుండా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడిన తెలంగాణలో.. నియామకాలే లేవని విపక్షాలు ఎండగడుతుంటే భారీ ఉద్యోగ ప్రకటనతో వారి నోళ్లు మూశారు. ఒక్కసారిగా 80వేల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే గ్రూప్-1, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను, విపక్షాల విమర్శలను సద్దుమణిగించడానికి కేసీఆర్ చేసిన ఈ ఒక్క ప్రకటన క్షేత్రస్థాయి నేతలకు కొండంత బలాన్నిచ్చింది. ఎన్నికల్లో ధైర్యంగా ముందుకెళ్లగలమనే ఆత్మ విశ్వాసాన్ని కల్పించింది.
కేసీఆర్ చూపిన దారిలోనే మోదీ ప్రయాణం
కేంద్రంలో మోదీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చారు. అయితే ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఈ ఒత్తిడి ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తోంది. విపక్షాలు నిరంతరం నిరుద్యోగాన్ని వేలెత్తి చూపడం, నిరుద్యోగ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషించడం, నిరుద్యోగుల నిరసనలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో సమస్యగా మారుతుందని భావించిన మోదీ…. కేసీఆర్ బాటనే ఎంచుకున్నారు. ఏడాదిన్నరలో 10లక్షల ఖాళీలు భర్తీ చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది మొదట్లో కేంద్రంలో 8.72లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కొత్త ఖాళీలలో కలిపి వీటినే భర్తీ చేయాలని మోదీ భావిస్తున్నట్లున్నారు. నిరుద్యోగులను చల్లబర్చడం ద్వారా తాము ఎన్నికల్లో లాభం పొందకపోయినా విపక్షాలతో నష్టం లేకుండా జాగ్రత్త పడొచ్చనేది కేసీఆర్, మోదీ వ్యూహంగా తెలుస్తోంది.
నిజంగా నిరుద్యోగం ఎన్నికలపై అంత ప్రభావం చూపెడుతుందా?
ప్రపంచంలోనే యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో ఎన్నికల్లో నిరుద్యోగం కీలక పాత్ర పోషిస్తుందనడం అతిశయోక్తి కాదు. అనేక నివేదికలు సైతం యువత ప్రభుత్వ పనితీరును ఉద్యోగ కల్పన ప్రాతిపదికతోనే అంచనా వేస్తున్నారని చెబుతున్నాయి. అయితే దేశంలో ఏటా కోటిమందికి పైగా కొత్త ఉద్యోగార్థులు పుట్టుకొస్తున్నారు. కానీ సగటున 2లక్షల 20 వేల ఖాళీలు మాత్రమే ఏర్పడుతున్నాయి. దేశంలో ప్రస్తుతమున్న దారుణమైన నిరుద్యోగ పరిస్థితులే అందుకు తార్కాణం. కరోనా సమయంలో దేశంలో నిరుద్యోగం 23.5శాతానికి పెరిగింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చినప్పటికీ గతనెలలో ఇది 7.12శాతంగా నమోదైంది. దేశంలో 40శాతం మంది మాత్రమే ఏదో ఒక పనిలో ఉన్నారు. ప్రపంచదేశాల్లో ఇది 60శాతంగా ఉంది. ఈ విషయంలో భారత్ బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉంది.
ఇవన్నీ ఎన్నికల వేళ తెరమీదకు రాకుండా ఓట్లకోసం ప్రజల్లోకి వెళ్లాలంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ కు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టడమే తమ ముందున్న ఏకైక మార్గం. అందుకే ఇద్దరూ ఒకే బాటను ఎంచుకున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!