హైదరాబాద్‌లో మరో సరికొత్త కేఫ్ అందుబాటులోకి వచ్చింది. హుస్సేన్ సాగర్ తీరంలో కొత్తగా నీరా కేఫ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.20 కోట్లను ఖర్చు చేసింది. నోరూరించే తియ్యటి నీరాను నగరవాసులకు అందించడంతో పాటు నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘నీరా కేఫ్’కు ఏర్పాటు చేసింది. నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరా కేఫ్‌కు శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. సుమారు 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది.
బోటింగ్ సౌకర్యం
నీరా కేఫ్‌ను రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా ఇక్కడ లభిస్థాయి. వీటి కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
నీరా.. వేదామృతం
నీరా అంటే కల్లు అని చాలా మంది భ్రమిస్తుంటారు. కానీ అది నిజం కాదు. కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లు పుల్లగా, మైకం ఎక్కించే గుణంతో ఉంటుంది. కానీ నీరా అలా కాదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తాటి చెట్ల నుంచి సేకరిస్తారు. బుధవారం నీరా కేఫ్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ డ్రింక్ గొప్పతనాన్ని కొనియాడారు. ఇది వేదామృతమని పేర్కొన్నారు. నీరా బహుళ పోషకాల గని. దేశంలో రాష్ట్రంలో ఈ తరహా కేఫ్ లేదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.
రోజుకు 1000 లీటర్లు
ఈ కేఫ్ ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరాను అందించగల సామర్థ్యాన్ని ప్రభుత్వం సృష్టించింది. ఇంత భారీ మెుత్తంలో నీరాను సమకూర్చుకునేందుకు హైదరాబాద్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న ముద్విన్, చెరికొండ అనె రెండు గ్రామాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే నగర శివార్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నందన వనంలోని తాటిచెట్ల నుంచి కూడా కొత్తమేర నీరాను సేకరించనున్నారు. అలా తీసుకొచ్చిన నీరా పాడైపోకుండా ప్రత్యేక బాక్సుల్లో భద్రపరుస్తారు. ఆ బాక్సుల్లో 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను మెయిన్‌టెన్ చేస్తారు. అలా చేయడం వల్ల నీరా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
లీటర్ రూ. 300
సేకరించిన నీరాకు ‘నీరా సొసైటీ’ లీటర్‌కు రూ.50 చెల్లిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తాము ఒప్పందం చేసుకున్న గ్రామాల్లో సుమారు 30,000-40,000 తాటి చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సగటున రోజుకు 10-20 లీటర్ల నీరా ఇవ్వగల్గితే నెలకు రూ.15,000 – రూ.30,000 వరకూ ఆదాయం పొందొచ్చని తెలిపారు. మరోవైపు సొసైటీ సేకరించిన నీరాను కేఫ్ నిర్వహకులు లీటర్‌కు రూ. 160 చెల్లించి కొనుగోలు చేస్తారని అధికారి తెలిపారు. దానిని వివిధ దశల్లో శుద్ది చేసి మార్కెట్‌లో లీటర్ రూ.300కు విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. కేఫ్‌లో 300ml నీరా బాటిల్ రూ. 90లకు అందుబాటులో ఉండనుంది.
నీరాను ఎలా భద్రపరుస్తారు?
నీరా, కల్లు రెండూ చెట్టు నుంచే వచ్చినప్పటికీ ఈ రెండింటి మధ్య కొంచెం తేడా ఉంది. తాడి, ఈత చెట్లు స్రవించే సహజమైన ద్రవమే నీరా. ఇందులోని సహజ చక్కెరలు అలాగే ఉంటే.. దానిని నీరా అంటారు. అందులోని చక్కెర ఆల్కాహాల్‌గా మారితే అప్పుడు కల్లు అవుతుంది. నీరాను సూర్యోదయానికి ముందే తీయాలి. ఎండపడి ఉష్ణోగ్రత మరో ఆరు డిగ్రీలు పెరిగితే అది పులిసిపోయి కల్లుగా మారుతుంది. కాబట్టి… నీరాను సేకరించే క్రమంలో నీరా సొసైటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. రైతుల వద్దకు వెళ్లి సేకరించిన నీరా.. పులియకుండా జీరో డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న బాక్సుల్లో భద్రపరుస్తారు. అదే టెంపరేచర్ మెయిన్‌టెన్ చేస్తూ కేఫ్‌కు తరలిస్తారు. అలా స్వచ్ఛమైన, తియ్యటి నీరాను వినియోగదారుల చెంతకు చేరుతుంది.
భిన్నాభిప్రాయాలు
అయితే దశాబ్దాల పాటు ఈ కల్లు వృత్తిలో ఉన్న గీత కార్మికులు నీరా సేకరించే పద్దతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చెట్టు నుంచి సేకరించిన నీరా.. కల్లుగా మారడానికి ఎంతో సమయం పట్టదని చెబుతున్నారు. కొన్ని గంటల్లోనే అది కల్లుగా మారిపోతుందని అనుభవంతో చెప్తున్నారు. అప్పటికప్పుడు చెట్టు నుంచి కిందకు తీసుకొచ్చిన నీరానే కొన్ని సందర్భాల్లో పుల్లగా ఉంటుందని.. మరీ దాన్ని కేఫ్ వరకూ ఎంత భద్రంగా తరలిస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా బాటిల్స్‌లో పెట్టి అమ్మడం వల్ల నీరా రుచి దెబ్బతినే అవకాశముందని సందేహిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్