దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించే చర్చిస్తోంది. పరువు నష్టం కేసులో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చటం, రెండేళ్లు జైలు శిక్ష విధించడం… తీర్పు వచ్చిన 24 గంటల్లోనే ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏం చేయనున్నారు? సభ్యత్వం రద్దు రాజ్యాంగబద్ధమేనా? పైకోర్టుకి వెళ్తే అనర్హత వేటు తొలిగిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ 2019లో వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో ‘మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలయ్యారు ఎందుకో?’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ఆయనపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు నష్టం పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు… రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడిన 24 గంటల్లోనే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం
రాజ్యాం గంలోని ఆర్టికల్ 102( 1)(E) , ప్రజాప్రతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ చట్టం ప్రకారం ఏదైనా నేరంలో రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. జైలు నుంచి విడుదలైన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. కిందకోర్టు ఇచ్చిన తీర్పుపై పైకోర్టు స్టే ఇవ్వడం, రద్దు చేయడం లేదా శిక్ష కాలాన్ని రెండేళ్లకంటే తక్కువకు కుదిస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఉపశమనం లభించకుంటే రాహుల్ 8(2ఏళ్ల జైలు+6ఏళ్లు అనర్హత) ఏళ్లు ప్రజాప్రతినిధి జీవితానికి దూరం కావాల్సి ఉంటుంది.
అనర్హత తొలిగించొచ్చా?
లక్ష్యద్వీప్ ఎంపీ NCP పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ కూడా ఇలానే అనర్హతకు గురయ్యాడు. కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశాడన్న కేసులో హత్యాయత్నం కేసులో అతడికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. దీంతో ఈ జనవరిలో అనర్హతకు గురయ్యాడు. ఆ వెంటనే ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ క్రమంలో ఫైజల్ పైకోర్టును ఆశ్రయించాడు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఫలితంగా ఆయన అనర్హత వర్తించదని వెల్లడించింది. ఉపఎన్నిక ఖర్చు నివారించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.
సభ్యత్వంపై సంధిగ్ధత
ఫైజల్‌పై అనర్హత వేటు వర్తించదని హైకోర్టు చెప్పినప్పటికీ లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ప్రజాప్రతినిధులు దోషిగా తేలి రెండేళ్లు అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు చెప్పగా… అప్పీలుపై స్పష్టత వచ్చేవరకూ అది వర్తించదని హైకోర్టు వెల్లడించింది. ఇలాంటి తరుణంలో రాహుల్ పైకోర్టుకు వెళితే ఏమవుతుందో చూడాలి.
ఇలాంటి వారెందరో
గతంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు పడిన నేతలు ఎందరో ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో 2013లో సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చటంతో మరుసటి అనర్హత పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ జయలలిత తన శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొడుతున్న కేసులో ఎస్పీ నేత ఆజాం ఖాన్‌ది ఇదే పరిస్థితి. అనిల్ కుమార్ సాహ్నీ, కుల్దీప్ సెంగర్ లాంటి వాళ్లు ఎందరో ఈ జాబితాలో ఉన్నారు.
న్యాయపోరాటం
రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయంపై విపక్షాలు భగ్గమన్నాయి. ఆయనకు సంఘీభావం తెలిపాయి. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన రాహుల్… “ భారత ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధం” అంటూ పోస్ట్ చేశారు. ఈ లెక్కన తదుపరి ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!