మరో వారంలో ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. కాగా గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జా, జానీ బెయిర్ స్టో, కైల్ జేమిషన్, జే రిచర్డ్సన్, సర్ఫ్రాజ్ ఖాన్, విల్ జాక్స్, ప్రసిద్ధ్ క్రిష్ణ, మొహిసిన్ ఖాన్, ముఖేష్ చౌదరి తదితరులు గాయాలతో బాధపడుతున్నారు. వీరందరూ ఈ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
మార్చి 31 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌పై ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే, చాలామంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. దీంతో ఆయా జట్లపై ప్లేయర్ల లేమి తీవ్ర ప్రభావం చూపనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ప్లేయర్ విల్ జాక్ ఇంజ్యూరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇతడి స్థానంలో జట్టు న్యూజిలాండ్ ప్లేయర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ని తీసుకుంది. జోష్ హేజిల్‌వుడ్ మడమ గాయం నుంచి కోలుకుంటున్నాడు. మరోవైపు, గతేడాది రాణించిన రజత్ పాటిదార్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. వీరిద్దరి స్థానంలో ఆర్సీబీ ఎవరినీ తీసుకోలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్..
గాయాల బెడద ఢిల్లీ క్యాపిటల్స్‌ని చుట్టుముట్టింది. జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో పంత్ స్థానంలో కెప్టెన్‌గా ఢిల్లీ జట్టు డేవిడ్ వార్నర్‌ని ఎంపిక చేసింది. కానీ, మరో బ్యాటర్‌ని తీసుకోలేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దిల్లీకి పంత్ వెన్నెముకలా నిలిచేవాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయంతో సతమతమవుతున్నాడు. మరి ఈ బ్యాటర్ తిరిగి జట్టులో చేరతాడా అన్నది సందేహంగా మారింది.
ముంబై ఇండియన్స్..
ముంబై ఇండియన్స్‌లో స్టార్ ప్లేయర్ బుమ్రాతో పాటు మరో పేసర్ జే రిచర్డ్ సన్ టోర్నీకి దూరం కానున్నాడు. తొడ కండరాలకు శస్త్రచికిత్స చేయించుకున్నాడీ ఆసీస్ పేసర్. ఇతడి స్థానంలో మరొకరిని జట్టు ప్రకటించలేదు.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ 2023 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ పేసర్‌కి వెన్నెముక సర్జరీ జరిగింది. గతేడాది 17 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టి జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇతడి స్థానంలో రాజస్థాన్ సందీప్ శర్మని తీసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్..
చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ కైల్ జేమిసన్ బ్యాక్ ఇంజ్యూరీ కారణంగా టోర్నీలో ఆడట్లేదు. గతేడాది అలరించిన మరో పేసర్ ముకేశ్ కుమార్ సైతం గాయం కారణంగా దూరమయ్యాడు.
పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో యాంకిల్ ఇంజ్యూరీ బారిన పడ్డాడు. అయితే, సర్జరీ చేయించుకున్నా ఐపీఎల్లో ఆడటానికి ఇంగ్లాండ్ బోర్డు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో టోర్నీకి దూరమయ్యే సూచనలు ఉన్నాయి.
కేకేఆర్..
కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఇంజ్యూరీ కారణంగా టోర్నీలోని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇతడి స్థానంలో కేకేఆర్ నితీశ్ రాణాను కెప్టెన్‌గా నియమించింది.