నటీనటులు: వి.కె.నరేశ్, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్ధన్ తదితరులు
రచన, దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల
సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్
ఛాయాగ్రహణం: సి.అంకుర్
నిర్మాతలు: బి.బాపినీడు, సుధీర్ ఈదర
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
విడుదల తేదీ: 14-08-2024
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ నటుడు నరేశ్ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్ మయూర్ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.
కథేంటి
రైల్వే ఉద్యోగి వీరాంజనేయులు (బ్రహ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజనేయులు మరణంతో ఇంటి బాధ్యత కుమారుడు నాగేశ్వరరావు (నరేశ్)పై పడుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె సరయు (ప్రియా వడ్లమాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వస్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మరి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వరరావు తనయుడు వీరు (రాగ్ మయూర్)కు, సరయు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
నాగేశ్వరరావు అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేశ్ తనదైన శైలిలో చక్కగా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. యున నటుడు రాగ్ మయూర్‌కు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక రవితేజ, రాకేశ్, హర్షవర్ధన్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్రమ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. అటు అంకుర్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- నరేశ్, రాగ్ మయూర్ నటన
- భావోద్వేగాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటిన్ స్టోరీ
- కొన్ని సాగదీత సీన్స్