• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Virat Ramayan Mandir: ముస్లింల భూమిలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం.. ఈ విశేషాలు తెలుసా?

    ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా సమీపంలో ఉన్న జానకి నగర్‌లో విరాట రామాయణ మందిరంను నిర్మిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకున్న అనంతరం నేపాల్‌లోని జనకపురి వెళ్లే మార్గంలో ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు. హిందూ దేవాలయ నిర్మాణం కోసం ముస్లింలు భూదానం చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మరి, ఈ ఆలయ విశేషాలు ఏంటో చూసేద్దామా. 

    ఆలయ ఎత్తు..

    విరాట్ రామాయణ మందిరం 405 అడుగుల ఎత్తులో నిర్మితమవుతోంది. దీంతో ప్రపంచంలో ఇదే అతి పెద్ద హిందూ దేవాలయం కానుంది. ఇప్పటి వరకు కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్(Angkor Wat) ఆలయమే అతి పెద్దది. 215 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి దాదాపు రెట్టింపు ఎత్తులో బిహార్‌లో ఆలయం నిర్మాణం కానుంది. 125 ఎకరాల విస్తీర్ణంలో 2800 అడుగుల పొడవు, 1400 అడుగుల వెడల్పుతో ఆలయం ఉండనుంది. 

    ముస్లింల దాతృత్వం

    ఈ ఆలయ నిర్మాణం కోసం ముస్లిం సోదర, సోదరీమణులు దాతృత్వం ప్రదర్శించడం గొప్ప పరిణామమని పట్నా మహవీర్ మందిర్ న్యాస్ సమితి అధినేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ వెల్లడించారు. కొందరు ఉచితంగా ఇవ్వగా, మరికొందరు భూములను విక్రయించడానికి సహకరించారు. ఓ హిందూ దేవాలయానికి హిందువులు భూమి ఇవ్వడం సాధారణ విషయమేనని, ముస్లింలు దానం చేయడమే అపూర్వమని కొనియాడారు. 2025లోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. 

    ప్రత్యేక శివలింగం

    విరాట్ రామాయణ మందిరంలో 18 ఆలయాలు ఉండనున్నాయి. పై భాగాన రాముడు, సీత విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ అష్టాదశ ఆలయాల్లో శివ, పార్వతులు కూడా కొలువై ఉండనున్నారు. శివాలయంలో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. 33 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పుతో మహాబలిపురంలో ఈ శివలింగాన్ని గ్రానైట్ శిలలతో తయారు చేయనున్నారు. 200 టన్నుల బరువు ఉండనుంది.

    20వేల మంది కూర్చునేలా..

    ప్రధాన ఆలయం విశాలంగా ఉండనుంది. రాముడు, సీత, లవ, కుశల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయం హాల్‌లో 20వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి పూజలు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. వాస్తవానికి మొదట ఈ ఆలయానికి ‘విరాట్ అంగ్‌కోర్ రామ్ మందిర్’ అని పేరు పెట్టాలని భావించారు. కానీ, కంబోడియా వాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నాటి హైందవ రాజు సూర్యవర్మన్ కాలంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రపంచ వారసత్వ కట్టడం. 

    ఈ ఆలయాల స్ఫూర్తితో..

    కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆలయం, దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం ఆలయం, మీనాక్షి దేవాలయం నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకుని విరాట్ రామాయణ మందిరంను నిర్మించనున్నారు. అయోధ్య రామమందిరం మాదిరిగానే ఈ ఆలయ నిర్మాణానికి కూడా విరాళాలు సేకరించనున్నారు. ప్రజలు, భక్తులు ఇచ్చే ఫండ్స్‌తో నిర్మాణం పూర్తి చేస్తామని సమితి అధినేత కునాల్ వెల్లడించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv