ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లా కరీంనగర్. వచ్చే ఎన్నికల వేళ ఇక్కడ ఉన్నంత హడావుడి మరెక్కడా ఉండదని చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో పోరు రసవత్తరం కానుంది. ఎందుకంటే భారాసకు మంచి పట్టు ఉండటంతో పాటు భాజపాకు బలం పెరగటమే కారణం. హ్యాట్రిక్ కొట్టి 15 ఏళ్లుగా జిల్లాను ఒంటి చేత్తో ఏలుతున్న గంగుల కమలాకర్… మెుదటిసారి ఎంపీగా గెలిచి ఏకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మధ్య మళ్లీ పోరు జరిగే అవకాశం ఉంది.
నియోజకవర్గం ఓటర్లు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెుత్తంగా 16 మండలాలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కిందకు మాత్రం 10 మండలాలు వస్తాయి. ఇందులో సుమారు 2 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ప్రతి ఏటా ఇక్కడ ఓటింగ్ శాతం భారీగానే నమోదవుతూ వస్తుంది. ఇందులో ముస్లింల సంఖ్య కూడా అధికంగానే ఉండటంతో వారి ఓట్లు కీలకంగా మారుతున్నాయి.
2018 ఎన్నికలు
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లటంతో 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కరీంనగర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. కారు గుర్తుకు 80, 983 ఓట్లు రాగా… సంజయ్‌కు 66,009 ఓట్లు వచ్చాయి. దీంతో 14,974 ఓట్లతో అప్పటి తెరాస విజయం సాధించింది. వీరిద్దరి మధ్య కేవలం 7.6 శాతం మాత్రమే తేడా ఉంది. కమలాకర్ హ్యాట్రిక్ కొట్టడంతో మంత్రి పదవి లభించింది.
2014 ఎన్నికలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మెుదటి ఎన్నికల్లోనూ కరీంనగర్లో గులాబీదే విజయం. గంగుల కమలాకర్‌కు 77,209 ఓట్లు రాగా.. సంజయ్‌కి 52,455 మంది ఓటేశారు. 24, 560 ఓట్ల తేడాతో గంగుల రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
భారాసా VS భాజపా
ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లోనూ భారాస, భాజపా మధ్యే పోటీ నెలకొంటుంది. సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లా కావటంతో పాటు స్థానికంగా పట్టు బాగా ఉండటం కలిసొచ్చే అంశం. అయితే, కమలం పార్టీని తక్కువ అంచనా వేయటానికి లేదు. బండి సంజయ్‌కు పెరిగిన సానుభూతితో పాటు సీఎంను నేరుగా ఢీకొడుతుండటంతో పోరు రసవత్తరం కానుంది.
కమలాకర్‌పై కన్నెర్ర
గంగుల దాదాపు 15 ఏళ్లుగా కరీంనగర్‌ను పాలిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై కాస్త వ్యతిరేక మెుదలయ్యిందని ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేయడం, తనిఖీలు నిర్వహించడంతో అక్రమ సంపాదన కూడబెట్టారనే ప్రచారం జరిగింది. అధికారం ఒక్కరి చేతిలోనే కేంద్రీకృతమై ఉండటం కూడా మంచిది కాదనే భావనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
సంజయ్‌కు కలిసొచ్చేనా
బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. మరోవైపు వచ్చే సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండుసార్లు ఓడిపోవటంతో పాటు స్థానికంగా బాగా పుంజుకోవటంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశం కావటంతో పాటు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం.
ఒకే సామాజికవర్గం
బండి సంజయ్, గంగుల కమలాకర్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఫలితంగా ఇద్దరికి ఓట్లు చీలుతున్నాయి. భారాస, బీజేపీ పార్టీల బలాల ఆధారంగా ఎవరి ఓట్లు వారికి పోలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం భారాసకు కలిసి వస్తుంది. వీరు ఓట్లు గంపగుత్తగా భారాసకే పడుతున్నాయి. మరి, ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
కాంగ్రెస్ లెక్కలు
రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014లో చల్మెడ లక్ష్మీ నరసింహ రావుకి 51, 339 ఓట్లు వచ్చాయి. 2018లో పొన్నం ప్రభాకర్ ప్రచారంలో వెనుకబడటంతో కేవలం 39,500 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ గులాబీ, కమళం వ్యూహాలను ఎదుర్కోలేక పోతున్నాయి. ఈసారి అక్కడ నిలబడే అభ్యర్థిపైన ఓట్ల సంఖ్య ఆధారపడుతుందని చెప్పవచ్చు.