ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
సూర్య ధనాధన్ ఇన్నింగ్స్
భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ ముంబయికి మెరుపు ఆరంభాన్నిస్తే.. నేహాల్ వధేరాతో కలిసి సూర్యకుమార్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఇషాన్ విధ్వంసంతో ముంబయి 4.3 ఓవర్లలోనే 51/0తో నిలిచింది. కానీ ఒక్క పరుగు తేడాతో ఇషాన్, రోహిత్ (7)లను ఔట్ చేయడం ద్వారా ముంబయిని హసరంగ డిసిల్వా దెబ్బతీశాడు. ఆ తర్వాత వచ్చిన సూర 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. హసరంగ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లతో అలరించాడు. ఆ వెంటనే వైశాఖ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాదేశాడు. తర్వాతి బంతికే అతడు ఔటైనా.. ముంబయికి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది.
దంచికొట్టిన మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్
బెంగళూరు ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (68), కెప్టెన్ డుప్లెసిస్ (65)ల ఆటే హైలైట్. రెచ్చిపోయి ఆడిన డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఏ బౌలర్‌నూ వదల్లేదు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ సీజన్లో అతడికి నాలుగో అర్ధశతకం కావడం విశేషం. మరోవైపు డుప్లెసిస్ కూడా చక్కని షాట్లు ఆడాడు. 30 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన అగ్రస్థానాన్ని డుప్లెసిస్ (12 మ్యాచ్‌ల్లో 576) మరింత బలోపేతం చేసుకున్నాడు. ఆర్సీబీ 15 ఓవర్లలో 152/5తో నిలవగా.. దినేష్ కార్తీక్ (30) బ్యాట్ ఝుళిపించాడు. కేదార్ జాదవ్ (12 నాటౌట్), హసరంగ (12 నాటౌట్) అజేయంగా నిలిచారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.