దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది.
లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections)
మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections)
ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
“క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections)
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.