మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర‘పై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. ‘ఆర్ఆర్ఆర్‘ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్ & కో ఫోకస్ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం (సెప్టెంబర్ 17) చెన్నైలో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో తారక్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్ మాత్రం ఫీలవుతున్నారు. తారక్ వంటి స్టార్ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్ చేస్తున్నారు.
కపిల్ శర్మ షోలో దేవర టీమ్!
దేవర టీమ్ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్ శర్మ సీజన్ 2’ షోలో తారక్ పాల్గొన్నాడు. బాలీవుడ్లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలోనూ రాజమౌళి, తారక్, రామ్‌చరణ్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్, అలియా భట్, సైఫ్ అలీఖాన్ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ & కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.
హిందీ బిగ్‌బాస్ 18లో తారక్?
హిందీలో బిగ్ బాగ్ షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ హిందీ సీజన్ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్ & కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 4 నుంచి బిగ్‌బాస్ 18 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.
యానిమల్ డైరెక్టర్‌తో ఇంటర్యూ
దేవర టీమ్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్ బదులిచ్చారు. తారక్ మాట్లాడుతూ దేవర యాక్షన్ డ్రామా అని, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్ గురించి చెప్పారు. 35 రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. దానికి తారక్ యానిమల్ రన్ టైమ్ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
మరి టాలీవుడ్ ప్రమోషన్స్ ఎక్కడా?
గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్ ఫోకస్ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్గా దేవర ప్రమోషన్స్ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్, కొరటాల ఇంటర్యూను ప్లాన్ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్టైనింగ్గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్, ప్రభాస్, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?