ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతున్నారు. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తారక్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై తొలిరోజు రూ.172 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్లో తమ చిత్రాలను నిలిపిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రభాస్ (Prabhas)
ప్రస్తుతం దేశంలో ఏ హీరోకు లేనంత క్రేజ్ ప్రభాస్‌కు ఉంది. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులన్నీ దాసోహం కావాల్సిందే. తొలి రోజు అత్యధికసార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్ టాప్‌లో ఉన్నారు. ప్రభాస్ ఐదు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ‘బాహుబలి 2’ (రూ. 214.5 కోట్లు), ‘సాహో’ (రూ.130 కోట్లు), ‘ఆదిపురుష్’ (రూ.140 కోట్లు), ‘సలార్’ (రూ.178.7 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.191.5 కోట్లు) చిత్రాలన్నీ తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.
విజయ్ (Vijay)
ప్రభాస్ తర్వాత విజయ్ అత్యధిక సార్లు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘ది గోట్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘లియో’ (Leo) చిత్రం తొలి రోజు రూ.145 కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (The G.O.A.T) ఫస్ట్ డే రూ. 126.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
జూ.ఎన్టీఆర్ (Jr NTR)
దేవర సినిమా సక్సెస్‌తో తారక్ ఈ జాబితాలో టాప్ 3లో నిలిచారు. ఆయన చేసిన రెండు చిత్రాలు తొలి రోజు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో చేసిన ‘RRR’ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.223 కోట్లను రాబట్టింది. తారక్ రీసెంట్ చిత్రం ‘దేవర’ (Devara) ఫస్ట్ డే రూ.172 కోట్లను వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల సక్సెస్‌తో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan)
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ (Jawan) ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.129 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
యష్ (Yash)
కన్నడ నటుడు యష్ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం ద్వారా తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. ‘కేజీఎఫ్’ (KGF)కు ముందు వరకూ కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన యష్ ఆ సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రం తొలి రోజు రూ.164 కోట్లు కొల్లగొట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా రూపొందించిన ‘యానిమల్’ (Animal) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌బీర్ కెరీర్లో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1 రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.116 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
రామ్‌చరణ్ (Ramcharan)
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సైతం హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా తొలి రోజు రూ.223 కోట్లను కొల్లగొట్టి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కూడా తొలి రోజు రూ.100 కోట్లు పైనే రాబడుతుందని చరణ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మక్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?