టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘క’ (Ka Movie). యువ డైరెక్టర్లు సుజీత్ – సందీప్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్గా నటించింది. 2024 దీపావళి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. తొలి 4 డేస్‌లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కంటెంట్ పరంగా చూస్తే అంతకంటే ఎక్కువ వసూళ్లనే ‘క’ రాబట్టి ఉండేది. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయం వల్ల ఈ మూవీ కలెక్షన్స్‌లో భారీ కోత పడింది. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్‌లో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నాకర్థంగా మారవచ్చు.
థియేటర్ల కేటాయింపులో అన్యాయం
కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రాన్ని దీపావళికి తీసుకొస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చేటప్పటికీ దివాలీ రేసులో ఏ చిత్రం లేదు. ఆ తర్వాత దీపావళి బరిలోకి ‘క’ (Ka)తో పాటు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar), ‘అమరన్’ (Amaran), ‘బఘీరా’ (Bagheera) వచ్చి చేరాయి. ఇందులో ‘లక్కీ భాస్కర్’ మినహా మిగిలిన రెండు చిత్రాలు పరభాష చిత్రాలే. తమిళ, కన్నడ చిత్రాలైనా ‘అమరన్’, ‘బఘీరా’ను తెలుగులో రిలీజ్ చేయడం వల్ల ‘క’ సినిమాకు ఆశించిన థియేటర్లు లభించలేదు. పైగా అమరన్ చిత్రాన్ని ప్రదర్శించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆసక్తికనబరిచాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి బలమైన నిర్మాణ సంస్థ లక్కీ భాస్కర్‌ను నిర్మించడంతో థియేటర్ల విషయంలో ఆ సినిమాకు పెద్దగా సమస్య ఏర్పడలేదు. కానీ ‘క’ చిత్రానికి మాత్రం తీవ్ర నష్టం ఎదురైంది. చిన్న సినిమా కావడం, పెద్ద స్టార్ హీరో లేకపోవడంతో ‘క’ సినిమాను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముందుకు రాలేదు. దీనివల్ల తెలుగు స్టేట్స్‌లో కేవలం 147 థియేటర్లలోనే ‘క’ రిలీజ్ కావాల్సి వచ్చింది. ఒకవేళ ముందుగానే అమరన్, బఘీరా చిత్రాలను దీపావళికి రాకుండా అడ్డుకొని ఉంటే ‘క’ చిత్రానికి థియేటర్లు పుష్కలంగా లభించేవి. మంచి హిట్ టాక్ వచ్చినందున సులువుగానే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది.
తెలుగు చిత్రాలను పట్టించుకోని ‘కోలీవుడ్’!
తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ, విక్రమ్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించడంలో తెలుగు ఆడియన్స్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, మన చిత్రాల విషయానికి వచ్చే సరికి తమిళనాడులో ఆ స్థాయి ఆదరణ లేదు. తమిళ దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులకు తెలుగు చిత్రాలంటే కాస్త చిన్నచూపు. ‘క’ విషయంలో ఇది మరోమారు బయటపడింది. పాన్ ఇండియా రిలీజ్‌లో భాగంగా ‘క’ చిత్రాన్ని తమిళనాడులో రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ, తమిళ దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ‘క’ చిత్రాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. తమిళంలో దీపావళికి వస్తున్న సినిమాలకు ‘క’ అడ్డుతగులుతుందని భావించి ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రకటించారు. అదే తమిళనాడులో ‘క’ రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు దొరకని కారణంగా ‘క’ వారం రోజులు ఆలస్యంగా అక్కడ రిలీజ్ కాబోతోంది.
పట్టించుకోని మీడియా!
తమిళనాడుతో పాటు, తెలుగు స్టేట్స్‌లోనూ ‘క’ సినిమాకు అన్యాయం జరిగితే టాలీవుడ్ పెద్దలు, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్ అబ్బవరం ఫెయిల్యూర్స్ గురించి పదే పదే ప్రస్తావించే తెలుగు ఫిల్మ్ సైట్స్, జర్నలిస్టులు, సోషల్ మీడియా.. భారీ విజయం సాధించినప్పటికీ జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. మీ సినిమాకు అంత బడ్జెట్ అవసరమా? తిరిగి రికవరీ చేయగలరన్న నమ్మకం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించే విలేఖరులు కలెక్షన్స్ దారుణంగా కోతకు గురవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మంచి సినిమాను బతికించాల్సిన బాధ్యత ఎంటర్‌టైన్ మీడియాకు లేదా?. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ముఖ్యంగా పండగ సీజన్లలో చిన్న సినిమాను రిలీజ్ చేయాలంటే యంగ్ హీరోలు, డైరెక్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి తలెత్తవచ్చు.
మార్పు తప్పనిసరి!
బాలీవుడ్, కోలివుడ్, శాండిల్‌వుడ్, మల్లువుడ్, హాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా విడుదలైనా, అది ఎలాంటి సీజన్ అయినా వాళ్లకు థియేటర్లు ఇచ్చేస్తారు. అవసరమైతే పోటీగా నిలిచిన చిన్న చిత్రాలు సైడ్ అయ్యేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, దసరా, దీపావళి, సమ్మర్ లాంటి సీజన్లలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు చెక్ పెట్టాలి. ఓ వారం ఆలస్యంగా విడుదల చేయమనాలి. అప్పుడు తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతాయి. ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడం లేదు. తమిళనాట తమిళ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు వర్తింపజేయకూడదు. దీనిపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆలోచన చేయాలి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం