కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు గెలుపు మాదంటే మాది అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఇటీవల విడుదలైన పలు సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
DK శివకుమార్ vs సిద్ధరామయ్య
కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల జాబితాలో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అగ్రనేతలుగా ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, KPCC అధ్యక్షుడు DK శివకుమార్‌లో ఒకరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికీ వారు బహిరంగంగా ప్రకటించనప్పటికీ కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానని ఇద్దరు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాదరణలో సిద్ధరామయ్య భేష్!
ప్రజాదరణ విషయానికొస్తే డీకే శివకుమార్‌తో పోలిస్తే సిద్దరామయ్య ముందు ఉన్నారు. 75 ఏళ్ల సిద్ధరామయ్య.. 2013 నుంచి 2018 మధ్య కర్ణాటకకు సీఎంగా చేశారు. గత 40 ఏళ్లలో కర్ణాటకకు పూర్తికాలం పాటు సీఎంగా చేసిన నేత ఆయన ఒక్కరే. పైగా ‘సిద్దూగా’ ఆయన ప్రజల్లో చాలా ఫేమస్ అయ్యారు. JDS అధినేత HD దేవగౌడకు కుడిభుజంగాను సిద్ధరామయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన వారసుడిగా కుమారుడు కుమారస్వామీని దేవగౌడ ప్రకటించడంతో 2005లో ఆయనతో విభేదించి సిద్దరామయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌లో జోష్ నింపారు. 2013లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
ట్రబుల్ షూటర్‌గా DK శివకుమార్!
మరోవైపు KPCC అధ్యక్షుడు DK శివకుమార్ సైతం కర్ణాటక కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఎదిగారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి స్థాయి నుంచి KPCC అధ్యక్షుడిగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అత్యంత సంపన్నుడిగా శివకుమార్ ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శివకుమార్ ఎంతో అండగా నిలిచారు. కష్టాల నుంచి గట్టెక్కించి ట్రబుల్‌షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించి శివకుమార్‌ను ED, CBI కేసులు వెంటాడుతున్నాయి. ఇది ఆయనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న సిద్ధరామయ్య, DK శివకుమార్‌లలో ఒకరికి సీఎం పదవి అప్పగిస్తే.. మరొకరు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే వీరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది.
అదిష్టానమే నిర్ణయిస్తుంది
కాగా, ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో DK శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం కొట్లాటలు లేవని పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు తనకు మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం కర్ణాటకలో భాజపాను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాకా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని శివకుమార్ తెలిపారు.
సిద్ధారామయ్య – శివకుమార్ భేటి
తమ మధ్య విభేదాలు తలెత్తాయని జోరుగా జరుగుతున్న ప్రచారానికి సిద్ధారామయ్య – శివకుమార్‌లు చెక్ పెట్టే యత్నం చేశారు. తాజాగా వీరు సమావేశమైన వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కర్ణాటక కాంగ్రెస్‌లో పరస్పర గౌరవం, స్నేహభావం ఉంటుందని ఈ వీడియోలో ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. ఒకరినొకరి యోగ క్షేమాలను తెలుసుకోవడంతో పాటు.. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇరు నేతలు చర్చించారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు
మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ 129 నుంచి 134 స్థానాలు గెలుపొందే అవకాశముందని లోక్ పోల్ సర్వే వెల్లడించింది. 59 నుంచి 65 సీట్లకే భాజపా పరిమితం అవుతుందని చెప్పింది. పీపుల్స్‌పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది