• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

    సంగ్రామ యాత్రలోనే ఆపరేషన్ ఆకర్ష్

    ఈ పాదయాత్ర బండి సంజయ్ గత పాదయాత్రల కంటే భిన్నంగా సాగనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను ఎండగడుతూనే ఆయా పార్టీలకు చెందిన అసంతృప్తి నేతలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బండి సంజయ్ పాదయాత్ర వ్యూహాత్మక ప్రాంతాల గుండా సాగనుంది. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, జనగాం వంటి కీలక నియోజవర్గాల్లో సాగనుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పలువురు కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో పాటు టీఆర్ఎస్ అసమ్మతి నేతలను ఆకర్షించేందుకు బీజేపీ సిద్ధమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి పాదయాత్రలో చేరి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డితో పాటు హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి, స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత మోహన్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

    ఆపరేషన్ ఆకర్ష్ కెప్టెన్ గా ఈటల

    మరోవైపు బీజేపీ పార్టీలో చేరికలను ప్రొత్సహించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆయా పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తిస్తోంది. వారి జాబితాను సిద్ధం చేసుకున్న ఈటల కమిటీ ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. ఇదేక్రమంలో  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపైనా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామ చేసి బీజేపీలో చేరితే.. మునుగోడులో ఉపఎన్నికలు అనివార్యం కానున్నాయి. దీంతో ఉపఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై మేధోమథనం చేసింది. ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్తేజం కలిగి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సులభంగా ఎదుర్కొవచ్చని ఈటల, అమిత్ షాకు వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి చేరిక తర్వాత మరికొంత మందిని పార్టీలోకి ఆహ్వానించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన శక్తిగా బీజేపీ ఎదిగేందుకు ఈటల కమిటీ పావులు కదుపుతోంది. 

    కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

    మరోవైపు కోమటి రెడ్డి  రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎప్పటినుంచో కోమటిరెడ్డి బ్రదర్స్( కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి) కాంగ్రెస్ పార్టీకి విన్నింగ్ బ్రదర్స్ గా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరినీ కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై చర్చించేందుకు  పార్టీ సీనియర్ నేత జానా రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించింది. సోమవారం ఉదయం ఢిల్లీకి చేరిన జానారెడ్డి.. అధిష్ఠానంతో చర్చించారు.  అటు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు.పలు దఫాలుగా రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో చర్చించారు. అటు టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డిని పార్టీ వీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా.. మునుగోడు నియోజవర్గంలోని ద్వితియ శ్రేణి నాయకత్వం చేజారకుండా చూడాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ నేతలను ఆదేశించింది.

    వ్యూహాత్మకంగా రాజగోపాల్ రెడ్డి

     కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు పార్టీ నేతలతో చర్చిస్తూనే…తన అనుచరగణంతో బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో తన పార్టీ మార్పు చారిత్రక అవసరమని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజవర్గం ప్రజలు సైతం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనని చర్చించుకుంటున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

    మొత్తంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఎటు వైపు తీసుకెళ్తుందోనని పలు పార్టీల నేతలు  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv