ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్, సాంగ్స్‌కు రీల్స్ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున ఆడుతున్న సమయంలో ఎక్కువగా సినిమా రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్ షూట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
రాజమౌళిని ఫేవర్ కోరిన వార్నర్!
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం.. రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు.
వార్నర్ రాక్స్.. రాజమౌళి షాక్స్!
ఒక వేళ తన సినిమాలో డేవిడ్ వార్నర్ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో అతడు నటిస్తే షూటింగ్ సెట్ ఎలా ఉంటుందోనని ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్.. ఇవన్నీ ఊహించుకొని దర్శకధీరుడు ఒక్కసారిగా భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’, ‘నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి’ అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్‌లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు ఫేవర్స్ కూడా మార్కెట్ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ లవర్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.