ప్రపంచంలోని అతిగొప్ప ఆధ్యాత్మిక దేశాల్లో భారత్ ఒకటి. దేవాలయాల భూమిగాను మన దేశం కీర్తి గడించింది. భారత్‌లో లక్షల సంఖ్యలో దేవాలయాలు, చర్చీలు, మసీదులు కొలువుతీరి ఉన్నాయి. వాటిని నిత్యం కోట్లాది మంది భక్తులు దర్శిస్తూ ఆధ్యాత్మిక చింతనను పొందుతుంటారు. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకం. నిత్యం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ శతాబ్దాల కాలంగా ఎంతో పేరుగాంచాయి. భక్తుల నుంచి వచ్చే విరాళాలతో ధనిక దేవాలయాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దేశంలోని టాప్-10 రిచ్ టెంపుల్స్ మీకోసం..
1. అనంత పద్మనాభస్వామి (కేరళ)
తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను కనుగొన్నారు. వాటిలో బంగారం, వజ్రాలు, విలువైన ఆభరణాలు, విగ్రహాలను గుర్తించారు. ఈ గుడి సంపద సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
2. తిరుమల (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే రెండో అతి సంపన్నమైన గుడిగా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. 2022 ఏడాదిలో భక్తుల నుంచి రూ.1450 కోట్లు కానుకలుగా వచ్చినట్లు TTD ప్రకటించింది. కాగా, స్వామి వారి పేరున రూ.16,000 కోట్ల నగదు, 10.25 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఉంది. వీటిపై వచ్చే వడ్డీ సొమ్ము TTD సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది.
3. షిర్డీ (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరం దేశంలోని సంపన్న దేవాలయాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచే గాక విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ టెంపుల్ పేరున బ్యాంకుల్లో రూ.1800 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 380 కేజీల బంగారం, 4,428 కేజీల వెండి, కోట్ల రూపాయల విదేశీ నగదు కూడా బ్యాంకుల్లో జమ అయ్యి ఉన్నాయి.
4. సిద్ది వినాయక దేవాలయం (మహారాష్ట్ర)
ముంబయిలోని సిద్ది వినాయక టెంపుల్ అత్యంత సంపన్నమైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ టెంపుల్ వార్షిక ఆదాయం రూ.125 కోట్ల వరకూ ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖల నుంచి దిగ్గజ వ్యాపారుల వరకు చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. విదేశాల నుంచి కూడా ఈ ఆలయానికి విరాళాలు వస్తుంటాయి.
5. స్వర్ణ దేవాలయం (పంజాబ్)
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సిక్కులకు ఎంతో పవిత్రమైంది. కోట్లాది రూపాయల విరాళాలతో ఈ ఆలయం కూడా ఎంతో సంపన్నమైనదిగా గుర్తింపు పొందింది. గోల్డెన్ టెంపుల్ వార్షిక ఆదాయం ఏటా రూ. 500 కోట్లుగా ఉంది. ఈ ఆలయ గోడలకు దాదాపు 400 కేజీల బంగారాన్ని పొదిగారు. రాత్రివేళల్లో ఈ ఆలయాన్ని దర్శిస్తే జీవితంలో మర్చిపోలేరు.
6. వైష్ణో దేవి ఆలయం (జమ్ముకశ్మీర్)
జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దేశంలోనే అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఈ గుడిని ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. కోరికలు నేరవేరిన భక్తులు కోట్లల్లో కానుకలు సమర్పిస్తారు. దీంతో ఈ టెంపుల్ వార్షిక ఆదాయం రూ.500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అంతేగాక ఈ గుడి 1.2 టన్నుల గోల్డ్‌ను కలిగి ఉంది.
7. మీనాక్షి ఆలయం (తమిళనాడు)
మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం ఏటా లక్షలాది మందిని భక్తులను ఆకర్షిస్తోంది. వారి నుంచి భారీ ఎత్తున వస్తున్న విరాళాలతో ఈ ఆలయం కూడా ఎంతో సంపన్నమైనదిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 1329 కేజీల బంగారాన్ని కలిగి ఉంది. అంతేగాక భక్తుల నుంచి ఏటా కోట్లాది రూపాయలు కానుకలుగా వస్తాయి.
8. జగన్నాథ దేవాలయం (ఒడిశా)
దేశంలోని ప్రముఖమైన ఆలయాల్లో పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి. ఈ ఆలయం 160 కేజీలకు పైగా బంగారాన్ని కలిగి ఉంది. అంతేగాక ఈ ఆలయం కింద 60,426 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ జరిగే రథయాత్రను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
9. సోమనాథ్ ఆలయం (గుజరాత్)
కోట్లలో విరాళాలు అందుకుంటున్న ఆలయాల్లో గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయం కూడా ఉంది. ఈ టెంపుల్ గుజరాత్‌లోనే అత్యంత ధనిక ఆలయంగా గుర్తింపు పొందింది. 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటిగా ఈ గుడి ప్రసిద్దికెక్కింది. ఈ ఆలయం పేరిట కూడా 130 కేజీల బంగారం ఉంది.
10. శబరిమలై (కేరళ)
శబరిమలైలోని అయ్యప్పస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. సముద్ర మట్టానికి 4,133 అడుగుల ఎత్తులో ఉండే ఆలయాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అయ్యప్పభక్తులు వస్తుంటారు. కోట్లల్లో కానుకలు సమర్పిస్తుంటారు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!