ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎన్నో విభిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ హిందూ జనాభా అధికంగా ఉండటంతో విగ్రహారాదనకు ప్రత్యేక స్థానమే ఉంది. ఫలితంగా భారత్ ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా మారిపోయింది. అంతేగాక ఆ విగ్రహాలు ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద విగ్రహాలు, ఎత్తు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
1. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (గుజరాత్)
స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరుగాంచిన గుజరాత్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దేశంలోనే అతి ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. దీని ఎత్తు 182 మీటర్లు (597అడుగులు) కాగా దీనిని నిర్మించేందుకు ఏకంగా 3.5 సంవత్సరాల సమయం పట్టింది. 2014లో దీని నిర్మాణం ప్రారంభమై 2018లో పూర్తయింది. ఈ స్టాట్యూ కోసం 70,000 టన్నుల సిమెంట్, 25,000 టన్నుల స్టీల్, 12,000 టన్నుల బ్రాంజ్ ప్యానెల్స్ ఉపయోగించారు.
2. సమతామూర్తి విగ్రహం (తెలంగాణ)
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ పరిధిలో ఉన్న సమతా మూర్తి విగ్రహం దేశంలోనే రెండో ఎత్తైన విగ్రహంగా రికార్డుకెక్కింది. 216 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని పంచ లోహాలతో నిర్మించడం విశేషం. కూర్చున్న స్థితిలో ఉన్న విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే రెండో అతి ఎత్తైన స్టాట్యూగా ఉంది. దీని నిర్మాణానికి రూ. 216 కోట్లు ఖర్చు చేశారు.
3. అంబేద్కర్ విగ్రహం (తెలంగాణ)
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 125 అడుగులు ఉన్న ఈ స్టాట్యూని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించారు. విగ్రహం బరువు సుమారు 465 టన్నులు ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. దీని నిర్మాణానికి 791 టన్నుల ఉక్కు ఉపయోగించారు. అలాగే 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు. ఈ విగ్రహం నిర్మాణం కోసం రోజూ సగటున 425 మంది కూలీలు పనిచేశారు.
4. పరమేశ్వరుడి విగ్రహం (రాజస్థాన్)
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా వద్ద నిర్మించిన శివుడి విగ్రహం 112 మీటర్ల (369 అడుగులు) ఎత్తు ఉంటుంది. శివుడు కాళ్లు మడుచుకొని కూర్చున్న స్థితిలో ఉంటాడు. ఈ విగ్రహాన్ని కూడా గతేడాదిలోనే అక్టోబర్ 29న ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే నాల్గో అతి ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. పరమేశ్వరుడి విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ బిలీఫ్’గా పిలుస్తారు.
5. పంచముఖ హనుమాన్ (కర్ణాటక)
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్ ప్రాంతంలో 49 మీటర్లు (161 అడుగల) ఎత్తుతో ఈ పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. 2022లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పంచముఖ హనుమాన్ గా ఇది పేరొందింది.
6. మురుగన్ విగ్రహం (తమిళనాడు)
తమిళనాడులోని సేలంలో ముతుమలై మురుగున్ విగ్రహం దేశంలోని అతి ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ స్టాట్యూ ఎత్తు 44.5 మీటర్లు (146 అడుగులు) కాగా దీనిని 2022లో ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహంగా రికార్డుకెక్కింది.
7. వైష్ణో దేవి విగ్రహం (ఉత్తర్‌ప్రదేశ్)
ఉత్తర్‌ప్రదేశ్ లోని బృందావన్ ప్రాంతంలో ఈ ఎత్తైన వైష్ణో దేవి విగ్రహం ఉంది. దీని ఎత్తు 43 మీటర్లు (141 అడుగులు). 2010లో ఈ విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాట్యూను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.
8. హనుమాన్ విగ్రహం ( ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని పరిటాల పట్టణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 41 మీటర్లు (135 అడుగులు) ఎత్తున్న ఈ విగ్రహం అభయాంజనేయ స్వామిగా భక్తుల మన్ననలు పొందుతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో ఆంజనేయ స్వామి విగ్రహంగా ఇది పేరొందింది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!