• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార‌త్‌కు త‌ప్ప‌ని భంగ‌పాటు

    ఆస్ట్రేలియాను వారి దేశంలోనే కంగారెత్తించాం. ఇంగ్లండ్‌ను క్రికెట్ మ‌క్కా లార్డ్స్‌లో చావు దెబ్బ తీశాం. న్యూజిలాండ్ రెక్క‌లు కూడా విరిచాం. ఇక శ్రీలంక‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ల‌పై ఎన్నో సిరీస్ విజ‌యాలు సాధించాం. ఇంత సాధించినా ఒక్క‌టి మాత్రం ఇప్ప‌టికీ లోటుగానే ఉంది. అదే స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డం. ఆసీస్‌, ఇంగ్లండ్‌, కివీస్ జ‌ట్ల‌ను వారి దేశాల్లో మ‌ట్టిక‌రిపించిన మ‌న‌కు ద‌క్షిణాఫ్రికా మాత్రం కొర‌కరాని కొయ్య‌గా త‌యారైంది. సెంచూరియ‌న్ విజ‌యంతో ఈసారి ఆ క‌ల సాకారం అవుతుంద‌నుకుంటే మ‌రోసారి అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది.

    స‌ఫారీ గ‌డ్డ‌పై భార‌త్‌కు మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. సెంచూరియ‌న్ టెస్టు విజ‌యంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన భార‌త్‌… ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు టెస్టుల్లోనూ ఓడి సిరీస్‌ను 1-2తో ప్ర‌త్య‌ర్థికి అప్ప‌గించేసింది. తాజా సిరీస్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 8 సార్లు ద‌క్షిణాఫ్రికాలో భార‌త్ ప‌ర్య‌టించ‌గా… 7 సార్లు సిరీస్ ఓట‌ములు త‌ప్ప‌లేదు. ఒక‌సారి (2010-11లో) మాత్రం 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకుంది.

    లోపం జ‌రిగింది అక్క‌డేనా…

    భార‌త దిగ్గ‌జం రాహుల్ ద్ర‌విడ్ పూర్తి స్థాయిలో కోచ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్నాక విదేశీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ ఆడ‌టం భార‌త్‌కు ఇదే తొలిసారి.  అందులోనూ అచ్చిరాని స‌ఫారీ ప‌ర్య‌ట‌న‌. అయితేనేం భార‌త్ ఫామ్‌ను చూస్తే ఈసారి అక్క‌డ టెస్టు సిరీస్ గెల‌వ‌డం ఖాయం అనిపించింది. కానీ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఒమిక్రాన్ అనిశ్చితి… కెప్టెన్సీ మార్పులు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. సిరీస్‌కు ముందు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ గాయంతో ప‌ర్య‌ట‌న‌కు దూర‌మ‌వ్వ‌డం. అంతేకాకుండా విరాట్ కోహ్లి, బీసీసీఐకి మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. అయితేనేం స‌ఫారీ గ‌డ్డ‌పై ల్యాండ్ అయిన టీమిండియా సెంచూరియ‌న్ విజ‌యంతో వివాదాలు మా ఫామ్‌ను ఆప‌లేవ‌నే సంకేతాల‌ను పంపింది. ఇక రెండో టెస్టు గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న‌ట్లు క‌నిపించింది. అయితే జ‌ట్టు ఆటతీరు ఒక్క‌సారిగా మారింది. రెండో టెస్టుకు గాయంతో కోహ్లి దూరం కావ‌డం ద‌గ్గ‌ర నుంచి భార‌త్‌కు ఏదీ క‌లిసి రాలేదు. ఓపెన‌ర్‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్‌, కేఎల్ రాహుల్ ఆడినా… చ‌తేశ్వ‌ర్ పుజారా, అజింక్య ర‌హానేలు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. సీనియ‌ర్లుగా ఉన్నా జ‌ట్టును ఆదుకోలేక టీమ్‌కు భారంగా త‌యార‌య్యారు. ఇక మూడో టెస్టులో ర‌హానే ఆట గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచింది. కోహ్లి ఆడినా.. అది అత‌ని స్థాయి ఆట అయితే కాదు. జ‌ట్టు ఎంపిక ద‌గ్గ‌రే లోపం ఉందంటూ మాజీలు విమ‌ర్శ‌లు సైతం చేశారు. ఏదైతేనేం స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెలిచే అరుదైన అవ‌కాశాన్ని భార‌త్ చేజార్చుకుంది.

    సూప‌ర్ ఎల్గ‌ర్ అండ్ కో

    స్టార్ ప్లేయ‌ర్లు ఏబీ డివిలియ‌ర్స్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, స్టెయిన్ ఒక్కొక్క‌రిగా జ‌ట్టుకు దూర‌మ‌య్యారు. ఈ టెస్టు సిరీస్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు అన్రిచ్ నోకియా గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. తొలి టెస్టు అనంత‌రం వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటువంటి స్థితి నుంచి డీన్ ఎల్గ‌ర్ అండ్ కో బౌన్స్ బ్యాక్ అవ్వ‌డం అమోఘం. పెద్ద‌గా స్టార్‌లు లేని ఆ టీమ్ స‌మ‌ష్టిగా ఆడి టీమిండియాకు షాకిచ్చింది. రెండో టెస్టులో ఎల్గ‌ర్ అద్భుతం చేస్తే… మూడో టెస్టులో ఆ బాధ్య‌త‌ను పీట‌ర్స‌న్ నిర్వ‌ర్తించాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌, ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్‌ల‌తో మెరిశాడు. ఇక బౌల‌ర్ల‌లో ఎన్‌గిడి, ర‌బ‌డ‌, జ‌న్‌సెన్, ఒలీవ‌ర్ త‌మ బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సిరీస్ గెల‌వ‌డానికి ఎల్గ‌ర్ అండ్ టీమ్ పూర్తిగా అర్హులు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv