ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం పండగే అని చెప్పవచ్చు. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాగే డబ్బింగ్ సినిమాలు సైతం మిమ్మల్ని తెలుగులో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హరోం హర (Harom Hara)
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ’హరోం హర’ (Harom Hara). జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. జులై 11వ తేదీ నుంచి ఆహా, ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన హరోం హరకు ద్వారక జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ హీరోయిన్. ప్లాట్ ఏంటంటే ‘కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?’ అన్నది కథ.
మహారాజ (Maharaja)
తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన ‘మహారాజ’ ఇటీవల విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా జూలై 12న నెట్‍ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన మహారాజ చిత్రం రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్లాట్ ఏంటంటే ‘మహారాజా ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మహారాజ గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాడు. ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి దాడి చేశారని చెప్తాడు. తన బిడ్డను కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు?’ అన్నది కథ.
ధూమం (Dhoomam)
మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్ర పోషించిన ‘ధూమం’ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. జూలై 11 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది జూన్‍లో మలయాళంలో విడుదలైన ధూమం అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ ఏంటంటే.. ‘అవినాష్ ఓ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాడు. ఈ క్రమంలో యజమానితో భేదాభిప్రాయాలు రావడంతో కంపెనీ నుంచి బయటకు వస్తాడు. ఓ రోజు కారులో తన భార్యతో వెళ్తున్న క్రమంలో అతనిపై కొంతమంది దాడి చేస్తారు. ఇంతకు అతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అవినాష్ భార్యకు వచ్చిన ప్రమాదం ఏంటి?’ అన్నది కథ.
మైదాన్ (Maidaan)
బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బయోపిక్ చిత్రం ‘మైదాన్’. హైదరాబాదీ లెజెండరీ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంపై ఈ మూవీ తెరకెక్కింది. అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. జూన్‍లోనే హిందీ వెర్షన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే తాజాగా తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ప్లాట్ (Plot)
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ‘ప్లాట్’ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. జూలై 11 నుంచి ఈటీవీ విన్ వేదిక స్ట్రీమింగ్‍కు అవుతోంది. సైకలాజికల్ థ్లిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం గతేడాది నవంబర్‌లో రిలీజైంది. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. ‘రాహుల్ (వికాస్ ముప్పాల) లవర్ దీపు డ్రగ్స్ డీలర్‌గా వ్యవహరిస్తూ ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. మృతుడి సోదరుడు ఆమెను వెతక్కుంటూ రాగా అతడ్ని కూడా రాహుల్‌తో కలిసి హత్య చేస్తుంది. కట్ చేస్తే రాహుల్‌కు ఓ అపరిచిత వ్యక్తి నుంచి వార్నింగ్ కాల్స్ మెుదలవుతాయి. దీంతో అతడి లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది?’ అన్నది కథ.
జిలేబీ (Jilebi)
‘నువ్వు నాకు నచ్చావ్’ సహా చాలా హిట్ చిత్రాలు తెరకెక్కించిన కె. విజయ్‌భాస్కర్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘జిలేబి’ గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. జిలేబీ సినిమాతో విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అయ్యాడు. థియేటర్లలోకి వచ్చిన 11 నెలల తర్వాత ఈ సినిమా ఆహా ఓటీటీలోకి వస్తోంది .జులై 13 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జిలేబి (శివానీ రాజశేఖర్)తో పరిచయం అవుతుంది. జిలేబి రహస్యంగా అబ్బాయిల హాస్టల్‌లోకి ప్రవేశించగా ఆమె పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండవలసి వస్తుంది. దీంతో ఆమె ఆమె కమల్ సహాయాన్ని కోరగా కొంతమంది ఆమె హాస్టల్‌లో ఉన్నట్లు కనిపెడతారు. హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేశాడు? చివరికి ఆమె ఎలా బయటకు వచ్చింది? అనేది సినిమా కథ.
మిర్జాపూర్ సీజన్ 3
అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని నుంచి వచ్చిన రెండు సిరీస్‌లు హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే గతవారం ‘మీర్జాపూర్ సీజన్ 3’ (Mirzapur Season 3) రిలీజైంది. జులై 5 నుంచి ఈ సిరీస్ హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. లాస్ వీక్ ఈ సిరీస్ మిస్ అయ్యి ఉంటే ఈ వారం చూసేయండి. ప్లాట్ ఏంటంటే.. మున్నా (దివ్యేంద్రు శర్మ) భాయ్‌ను చంపేసిన తర్వాత మీర్జాపూర్ సింహాసనం గుడ్డు (అలీ ఫజల్) కాళ్ల దగ్గరకు వస్తుంది. అప్పటివరకూ ఖాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసించాడు? గుడ్డును చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానికి లోకల్ గ్యాంగ్స్ ఏం చేశాయి? వారిపై గుడ్డు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది సీజన్ 3లో చూపించనున్నారు.
శశిమథనం
గత వీకెండ్ వచ్చిన మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ సిరీస్ ‘శశిమథనం’. ఇందులో పవన్ సిద్ధు, సోనియా సింగ్ జంటగా చేశారు. రూపలక్ష్మీ, ప్రదీప్ రాపర్తి, కృతిక, అశోక్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై 4 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే.. మదన్ (పవన్ సిద్ధు), శశి (సోనియా) లవర్స్. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మదన్ బెట్టింగ్స్, పేకాటలకు అలవాటు పడతాడు. ఓ రోజు డబ్బులు పోగొట్టుకోని చిక్కుల్లో పడతాడు. అప్పుల వాళ్ల నుంచి తప్పించుకునేందుకు శశి ఇంటికి వస్తాడు. అక్కడ శశికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ ఆ ఘటనలు ఏంటి? వాటి నుంచి మదన్-శశి ఎలా బయటపడ్డారు? అన్నది స్టోరీ.
గరుడన్
తమిళ స్టార్ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గరుడన్’. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 4న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. భాషతో సంబంధం లేకుండా ఓ మంచి సినిమాను వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలని భావించే వారికి ‘గరుడన్’ తప్పక నచ్చుతుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కథ సాగుతున్నకొద్దీ వీళ్ల మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత గొడవలు మెుదలవుతాయి. ఈ క్రమంలో ఊరిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది ఆసక్తికరం.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’