ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.
ఆదిలోనే ఆటంకం
ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి వెళ్లింది.
అమ్మోరి దయ
రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. దాదాాపు 100 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోలాహలంగా సాగిన జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వచ్చారు.
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ
ముచ్చింతల్‌లో రామానుజాచార్య 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇందులో 108 దివ్య దేవాలయాలను అచ్చుగుద్దినట్లు వాస్తవిక ఆలయాలకు తగినట్లు రూపకల్పన చేయడం అద్భుతం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని నామకరణం చేశారు.
మల్లన్న సాగర్
సిద్దిపేట జిల్లా తొగుట-కొండపాక మండలాల శివారులో నిర్మించిన మల్లన్న సాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ జలాశయం నీటితో మల్లన్న పాదాలు కడిగారు.
టీ హబ్ 2.0
టీ హబ్ 2.0ను రెండో దశ పనులను సుమారు రూ. 400 కోట్లతో పూర్తి చేసి 1500 కంపెనీలు నెలకొల్పడానికి అవసరమైన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించి దేశ యువతకు అంకితమిచ్చారు.
యాదాద్రీశుడి సంప్రోక్షణ
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం పూర్తైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఆచారాల ప్రకారం ప్రారంభించారు. సంప్రోక్షణ, యాగాలు జరిపించి ఆలయానికి సరికొత్త రూపం తీసుకువచ్చారు. భక్తులకు కొత్తగా నిర్మించిన గుడిలో దర్శనాలకు అవకాశం కల్పించారు.
బాక్సింగ్ క్వీన్
కామన్ వెల్త్ గేమ్స్‌లో హైదరాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ ఓ సంచలనం. ఫైనల్స్‌లో విజయకేతనం ఎగురవేసి గోల్డ్ మెడల్ సాధించింది . నిజామాబాద్‌లో పుట్టిన ఈ చిరుతపులి తన పంచ్‌తో రికార్డుల మోత మోగించింది.
ప్రాణహిత పుష్కరాలు
రాష్ట్రంలో 12 ఏళ్లకు ఒకసారి ప్రాణహిత పుష్కరాలు వస్తాయి. ఏప్రిల్‌లో దాదాపు 12 రోజుల పాటు జరిగిన పుణ్యస్నానాలకు కోట్లలో భక్తులు తరలివచ్చారు.
చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్
తెలంగాణ హైకోర్టుకు ఈ ఏడాది కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. జూన్‌లో జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు.
రగిలిపోయిన సికింద్రాబాద్
ఆర్మీ, నేవీ నియామకాల్లో ఒప్పంద ప్రాతిపదిక ప్రవేశ పెట్టడంపై నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మారణహోమం సృష్టించారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆగ్రహావేశాలతో రైలుకు నిప్పు పెట్టారు. రాకేశ్ అనే ఆశావాహి మృతిచెందాడు.
బాసర ఆందోళనకు దిగొచ్చిన కేటీఆర్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన పోరాటం ఈ ఏడాది ప్రకంపనలు సృష్టించింది. రోజుల తరబడి ఎండా, వాన లెక్క చేయకుండా విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారానికి భీష్మ పట్టు పట్టారు. మంత్రి కేటీఆర్ యూనివర్సిటీని సందర్శించి ఇబ్బందులు తెలుసుకున్నారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని శాఖలను అనుసంధానిస్తూ అత్యాధునిక సాంకేతికతతో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 4న ప్రారంభించారు. హైదరాబాద్ బంజాారాహిల్స్లో 20 అంతస్థుల్లో నిర్మించారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలన్నింటి అనుసంధానం జరిగింది. అంతేకాదు, ఒకేసారి లక్ష కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెర అందుబాటులో ఉంది.
స్వతంత్ర వజ్రోత్సవాలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని అమృత్ మహోత్సవాలకు పిలుపునిచ్చారు. కానీ, అప్పటికే కేంద్రంతో పొసగకపోవటంతో కేసీఆర్ స్వతంత్ర వజ్రోత్సవాలనే మాట తెరపైకి వచ్చింది.
ఆగస్టు 8న వేడుకలు ప్రారంభించి జాతీయ జెండాల ప్రదర్శన, సామూహిక జాతీయ గీతాలాపన, ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ, ఫ్రీడం రన్, ఫ్రీడం ర్యాలీలు వంటి కార్యక్రమాలు 15 రోజుల పాటు అంటే ఆగస్టు 22 వరకు హోరెత్తాయి. దేశభక్తిని ఎలిగెత్తి చాటాయి.
ఉప్పల్ మ్యాచ్
దాదాపు 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. సెప్టెంబర్‌లో జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. టికెట్ల అమ్మకంలో గందరగోళం నెలకొనడంతో జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో కొందరు గాయపడ్డారు.
క్యాసినో కలకలం
హైదరాబాద్‌లో క్యాసినో వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా తీసుకెళ్లారని అనుమానాలు.
వికటించిన ఆపరేషన్లు
తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. స్టెరిలైజేషన్ సరిగా చేయని కారణంగా మృతిచెందటం కలకలం రేపింది. దీంతో డాక్టర్‌తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
మునుగోడు ఉపఎన్నిక
కోమటి రెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకోవటంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. ఎన్నికలో భాజపాను దెబ్బకొట్టాలనుకున్న కేసీఆర్ ప్రణాళికలు ఫలించాయి. మంత్రి కేటీఆర్ దత్తత హామీ, జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గ సమ్మెళనాలు, వామపక్షాల మద్దతుతో తెరాస జయకేతనం ఎగురవేసింది.
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు తెరాస ఇచ్చిన హామీల్లో ఒకటి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు. కానీ, ఆచరణ సాధ్యం కాలేదు. కేంద్రం మెుండిచేయి చూపిస్తుందంటూ నాన్చుతూ వచ్చిన కేసీఆర్..ఉపఎన్నిక సమయంలో ఆ బిల్లును ఆమోదించారు. తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు.
కొలువుల జాతర
నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో ఎట్టకేలకు నియామకాల జాతర ప్రారంభమయ్యింది. దాదాపు 80వేలకుపైగా ఉద్యోగ ఖాళీలు నింపుతున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆచరణలోనూ అంతేవేగంతో వెళ్తున్నారు.
తెరాస టూ భారాస
కేంద్రం వైఖరిని చాలా రోజులుగా తప్పుపడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేశారు. దిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభమయ్యింది. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది నినాదం.
కాంగ్రెస్‌లో ముసలం
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటీ నుంచి కాంగ్రెస్‌లో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. జగ్గారెడ్డి వ్యవహారం, మాణిక్కం ఠాగూర్‌పై ఆరోపణలు. ఇటీవల పదవుల విషయంలో సీనియర్ నేతలు రచ్చకెక్కటం కలకలం రేపాయి.
ఫార్ములా రేసింగ్
అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫార్ములా రేసింగ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. నెక్లెస్ రోడ్లో జరిగిన పోటీల్లో తొలుత అపశృతి చోటు చేసుకోవటంతో రద్దు చేశారు. తర్వాత మళ్లీ ప్రారంభించి కొంత గందరగోళ పరిస్థితుల్లోనే పూర్తి అయ్యింది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి